ట్వీట్‌లో అక్షరాల పరిమితిని 280 నుంచి 2,500కు పెంచనున్న ట్విటర్

- June 23, 2022 , by Maagulf
ట్వీట్‌లో అక్షరాల పరిమితిని 280 నుంచి 2,500కు పెంచనున్న ట్విటర్

ప్రస్తుతం కాలంలో ట్విటర్‌ను ప్రజలు ఎంతగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ రంగానికి చెందిన వారు ఏవైనా విషయాలను ప్రజలకు చెప్పాలనుకుంటే ట్విటర్‌ను బాగా వాడేస్తుంటారు.

స్మార్ట్‌ఫోన్‌లు అందరి చేతుల్లోనూ ఉంటుండడంతో సామాన్యులు కూడా ట్విటర్‌ను బాగా వాడుతున్నారు. అయితే, ట్విటర్‌లో ఏదైనా రాసి పోస్ట్ చేయాలనుకుంటే కేవలం 280 అక్షరాలు మాత్రమే రాయగలం. అంతకు మించి క్యారెక్టర్లు రాయాలనుకుంటే మరో ట్వీట్ చేయాల్సిందే. అయితే, అక్షరాల పరిమితిని 280 నుంచి 2,500కు పెంచాలని ట్విటర్ యోచిస్తోంది. ఈ మేరకు నోట్స్ పేరిట కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే యూజర్లు తమ సుదీర్ఘ సందేశాలను పోస్టు చేయొచ్చు.

అలాగే, దాంతో పాటు ఫొటోలు, వీడియోల వంటివి కూడా జోడించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ట్విటర్ టైమ్ లైన్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు చేసే ఈ సుదీర్ఘ ట్వీట్‌ ప్రివ్యూను కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఘనాల్లో ప్రయోగాత్మకంగా ట్విటర్‌ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నోట్‌ను షేర్ చేసుకోవాలనుకునేవారి కోసం అందుకోసం ప్రత్యేకంగా లింక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. 2017 కంటే ముందు ట్విటర్‌లో క్యారెక్టర్ల పరిమితి 140గా ఉండేది. అయితే, అనంతరం ఆ పరిమితిని 280కి పెంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com