సంస్కృత భాషను అభ్యసించడం ప్రజా ఉద్యమంగా మారాలి: ఉపరాష్ట్రపతి

- July 09, 2022 , by Maagulf
సంస్కృత భాషను అభ్యసించడం ప్రజా ఉద్యమంగా మారాలి: ఉపరాష్ట్రపతి

బెంగళూరు: భారతదేశ ఆత్మను అధ్యయనం చేసే విషయంలో సంస్కృత భాషను నేర్చుకోవడం అత్యంత ఆవశ్యకమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం సంస్కృత భాషను ప్రతి ఒక్కరికీ చేరవేయడాన్ని ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ దిశగా సంస్కృత విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులతోపాటు సంస్కృతంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. రాజ్యాంగపరమైన విధానాలు, ప్రభుత్వం చొరవ ద్వారా మాత్రమే భాషలను పరిరక్షించుకోలేమని ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకున్నప్పుడు భాషలను తద్వారా మన సంస్కృతిని కాపాడుకోగలమని ఆయన పేర్కొన్నారు.

శనివారం బెంగళూరులోని, కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి, సంస్కృత భాష పరిరక్షణ అవసరాన్ని నొక్కిచెప్పారు. మన కుటుంబాల్లో, మన తోటి సమాజంలో మన విద్యాసంస్థల్లో సంస్కృత భాషను ప్రోత్సహించేందుకు కృషి జరగాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకుంటూ సంస్కృతంతో పాటు ఇతర ప్రాచీన భారతీయ భాషలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాచీన వ్రాతప్రతులు, శిలాశాసనాలు, శాసనాల డిజిటలీకరణ, వేదాధ్యయన రికార్డింగ్, తత్సంబంధిత పుస్తకాల ప్రచురణలను చేపట్టడంతో పాటుగా సంస్కృత భాష్యాలను సులువుగా నేర్చుకోవడంతోపాటు, అర్థం చేసుకునేందుకు వీలైన అంశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో సంస్కృత భాష నిగూఢంగా కనిపిస్తుందన్న ఉపరాష్ట్రపతి, ప్రపంచవ్యాప్తంగా భారతీయతకు, మన విలువలను అర్థం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో సంస్కృత భాషను నేర్చుకునేందుకు ఆసక్తి పెరుగుతోందన్నారు. మన సాంస్కృతిక, ఘనమైన నాగరికత విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సంస్కృతాన్ని నేర్చుకోవాలన్నారు.

తత్వ, మత సంబంధమైన అంశాలను తెలుసుకునేందుకు మాత్రమే సంస్కృతాన్ని పరిమితం చేయకూడదని, ఆయుర్వేదం, యోగ, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, ధాతుశోధన శాస్త్రం (మెటలర్జీ), జ్యోతిష్యశాస్త్రం, కళలను అధ్యయనం చేసేందుకు కూడా సంస్కృతం అవసరం ఎంతగానో ఉందన్నారు. ప్రతి విద్యార్థి భారతీయ విజ్ఞాన ఖనిని వెలికితీసి తమ జీవితాలను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సంస్కృతాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. 

భారతదేశంలో భిన్నమైన భాషలున్నాయని, ఒక్కో భాషకు తనదైన ప్రత్యేకత ఉందని ఇంతటి భాషా సంపదను కలిగి ఉన్నందుకు మనమంతా గర్వించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే భారతదేశం ‘విశ్వగురువు’గా విరాజిల్లిందని ఆయన అన్నారు. 

ప్రాచీన భాషల పరిరక్షణ విషయంలో కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం పోషిస్తున్న పాత్రను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. భాషా పరిశోధనకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ సమకాలీన ప్రపంచానికి అవసరమైన అంశాలను అందుకునే దిశగా ఈ పరిశోధనలను జరగాలని ఆయన సూచించారు. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మళయాలం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా దక్కడం ఆయా భాషల ప్రాధాన్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.

ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు,మధ్వాచార్యులు,బసవేశ్వరుడు వంటి ఎందరో మహనీయుల పాదస్పర్శతో పునీతమైన కర్ణాటకలో జ్ఞాన, తత్వనిధికి కొరతలేదని, దీన్ని వెలికితీయడంపై సంస్కృత విశ్వవిద్యాలయం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ఈ సందర్భంగా ఆచార్య ప్రద్యుమ్న, డాక్టర్ వీఎస్ ఇందిరమ్మ, విద్వాన్ ఉమాకాంత భట్ లకు గౌరవ డాక్టరేట్లను ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, విశ్వవిద్యాల ఉపకులపతి ప్రొఫెసర్ కేఈ దేవనాథన్ సహా పాలకమండలి సభ్యులు, బోధనాసిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com