మూడు రోజుల పాటు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటన..

- July 18, 2022 , by Maagulf
మూడు రోజుల పాటు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటన..

అమరావతి: జులై 20, 21 , 22 తేదీల్లో ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించబోతారని పార్టీ నేత నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. జులై 20న కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో, 21న కూనవరం, చింతూరు, ఏటపాక, వీఆర్‌పురం మండలాల్లో.. 22న పి.గన్నవరం, రాజోలులో చంద్రబాబు పర్యటించనున్నారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో వైస్సార్సీపీ సర్కారు విఫలమైందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సీఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల వరద ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే జగన్‌రెడ్డి.. కాలికి బురద అంటకుండా హెలికాఫ్టర్‌లో తిరుగుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

లంకలు, ఏజెన్సీ గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని నదీ పాయలన్నీ ఏటిగట్లను తాకుతూ ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల గట్లను దాటుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారని చంద్రబాబు అన్నారు. మరోపక్క టీడీపీ నేతలు సైతం ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాణి లంకలో.. వరద బాధితులను మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు పరామర్శించారు. నాటు పడవపై ఆ ప్రాంతానికి చేరుకుని వరద నీటిలో ఇంటింటికి వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలు సరిగ్గా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ముంపునకు గురైన ప్రాంతాలను టీడీపీ సభ్యుల బృందం పరిశీలించింది. ముంపునకు గురైన కాలనీలను పరశీలించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పునరావాస శిబిరాల్లో భోజన వసతులు సరిగా లేవని ప్రజలు చెబుతున్నారని మండిపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com