మక్కాలోని నిజాం రుబాత్‌లో ఉచిత భోజన, వసతి, ల్యాండ్రీ..

- April 12, 2016 , by Maagulf
మక్కాలోని నిజాం రుబాత్‌లో ఉచిత భోజన, వసతి, ల్యాండ్రీ..

నిజాం ఎస్టేట్ (ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం) నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం నిజాం పాలకులు సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో నిజాం రుబాత్ ( వసతి గృహాలు) నిర్మించారు. హజ్‌యాత్రకు వెళ్లిన వారికి వీటిల్లో ఉచితంగా సేద తీరే సదుపాయం కల్పిస్తారు. అయితే కొన్నేళ్ల క్రితం అక్కడి ప్రభుత్వం కాబా గృహం మైదానాన్ని వెడల్పు చేసే క్రమంలో 9 వసతి గృహాలను కూల్చివేసింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఒక్క వసతి గృహం మాత్రమే మిగిలింది. దీనికితోడు గత కొన్నేళ్ల నుంచి నిజాం అవుకాఫ్ కమిటీ, నిజాం రుబాత్ నిర్వాహకుడి మధ్య తలెత్తిన విభేదాలతో నిజాం రుబాత్‌లో రాష్ట్రం నుంచి వేళ్లే యాత్రికులకు వసతి లభించేది కాదు.కేంద్ర హజ్ కమిటీ కూడా నిజాం రుబాత్‌లో బస చేయడానికి అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల హజ్ యాత్రకు వెళ్లిన వారు వేరే ప్రాంతాల్లో ఉంటూ అదనంగా రూ.40 వేల వరకు ఖర్చు చేసుకునేవారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరువ తీసుకున్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి అవుకాఫ్ కమిటీ, నిజాం రుబాత్ నిర్వాహకుడితో సమస్యలపై చర్చించాలని ఆదేశించారు. సమస్యకు పరిష్కారం లభించడమేగాక గతేడాది రాష్ట్రం నుంచి వెళ్లిన 500 మందికి నిజాం రుబాత్‌లో వసతి లభించింది.ఏటా దాదాపు 2500 మంది వరకు హజ్ యాత్రకు వెళ్తుంటారు. ఇందులో రుబాత్ వసతుల కోసం లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న వారిలో 1000 మందికి మక్కాలోని నిజాం రుబాత్‌లో ఉచిత భోజన, వసతి, ల్యాండ్రీ సౌకర్యం కల్పించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com