భార‌త్‌లో మూడో మంకీపాక్స్ కేసు ..

- July 22, 2022 , by Maagulf
భార‌త్‌లో మూడో మంకీపాక్స్ కేసు ..

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో మూడో మంకీపాక్స్ కేసు నమోదైంది. కరోనా తీవ్రత పూర్తి స్థాయిలో ఇంకా తగ్గకముందే మరోమహమ్మారీ దేశంలోకి ప్రవేశించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే రెండు మంకీపాక్స్ కేసులు కేరళలో నమోదు కాగా..తాజాగా మూడో కేసు సైతం కేరళలో వెలుగుచూసింది.

యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి జూలై 6న యూఏఈ నుంచి కేరళలోని మల్లాపురానికి తిరిగి వచ్చాడని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అతడు జ్వరంతో 13వ తేదీన మాంజెర్రీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేరాడని ఆమె తెలిపారు. 15వ తేదీ నుంచి అతడిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయని వెల్లడించారు. 35 ఏళ్ల సదరు వ్యక్తి ప్రైమరీ కాంటాక్టులన్నీ ట్రేస్ చేశామని.. అందరినీ ఐసోలేషన్ ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కేరళలో జులై 14న మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. అతడు కూడా యూఏఈ నుంచి వచ్చిన ప్రయాణికుడు కావడం గమనార్హం.

ఆ వ్యక్తి జులై 12న రాష్ట్రానికి చేరుకున్నాడని, త్రివేండ్రం విమానాశ్రయం నుంచి స్వస్థలానికి వచ్చారని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ తర్వాత కన్నూర్‌ జిల్లాలో రెండో కేసు నమోదైంది. కన్నూర్‌ జిల్లాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ బయటపడినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వ్యక్తి జులై 13న దుబాయ్‌ నుంచి బయలుదేరి కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో దిగారు. ఆ తర్వాత లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను ఎన్‌ఐవీ పుణేకు పంపించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇలా మొత్తం మూడు కేసులు కేరళలో బయటపడడం తో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com