‘థాంక్యూ’మూవీ రివ్యూ

- July 22, 2022 , by Maagulf
‘థాంక్యూ’మూవీ రివ్యూ

నటీనటులు: నాగ చైతన్య, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి తదితరులు,
డైరెక్టర్: విక్రమ్ కుమార్
ప్రొడ్యూసర్: దిల్ రాజు, శిరీష్ 
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
సినిమాటోగ్రీఫీ: పి.సి. శ్రీరామ్
రిలీజ్ డేట్: 22. 07. 2022

‘లవ్ స్టోరీ’ సినిమా తర్వాత నాగ చైతన్య నుంచి వచ్చిన సినిమా కావడంతో, ‘థాంక్యూ’ సినిమాపై అంచనాలు పెరిగాయ్. అందులోనూ నాగ చైతన్య ఆంబియన్స్ ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేయడంలో మరో మెయిన్ అస్సెట్ అని చెప్పొచ్చు. మరి, ఆ అంచనాల్ని ‘థాంక్యూ’ సినిమాతో చైతూ అందుకున్నాడో లేదో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ: 
అభి (నాగ చైతన్య) పేదింటి కుర్రాడు. చాలా కష్టపడి మెట్టు మెట్టూ ఎక్కుకుంటూ అమెరికా వరకూ వెళతాడు. అమెరికాలో ఓ పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. చిన్నతనం నుంచే కొన్ని ఆశయాలుంటాయ్ అభికి. పెద్ద అయ్యేకొద్దీ తన ఆలోచనా ధోరణి మారుతూ వస్తుంది. జీవితంలో ఆ స్థాయి సక్సెస్ అందుకోవడానికి చాలా చాలా వదులుకోవల్సి వస్తుంది అభికి. అందుకే, ఒకానొక టైమ్‌లో నేను, నా ఎదుగుదల మాత్రమే ఎవ్వరెలా పోతే నాకేంటీ.? అనే తీరుకి వచ్చేస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే సెల్ఫ్ సెంట్రిక్ అయిపోతాడు. అతని మనసు చూసి ప్రేమలో పడుతుంది ప్రియ (రాశీఖన్నా). అయితే, రాను రాను అభి సెల్ఫ్ సెంట్రిక్ తెలుసుకున్న ప్రియ అతనికి దూరమైపోతుంది. ప్రియ దూరమైపోయాకా, అభిలో మార్పు వస్తుందా.? అసలు అభి అంత సెల్ఫ్ సెంట్రిక్‌గా మారడానికి దారి తీసిన పరిస్థితులేంటీ.? అమెరికా నుంచి ఇండియాకి తిరిగొచ్చిన అభి ఏం చేశాడు.? అన్నది తెలియాలంటే ‘థాంక్యూ’ సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడాల్సిందే. 

నటీ నటులు ఎలా చేశారంటే:
ఆల్రెడీ ‘ప్రేమమ్’ సినిమాలో నాగ చైతన్యను ఈ తరహా పాత్రలో చూసేశాం. రకరకాల వేరియేషన్స్‌లో నాగ చైతన్య కనిపించాడు. తన పర్ఫామెన్స్‌తో ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. మూడు పాత్రల్లో, మూడు డిఫరెంట్ యాంగిల్స్‌లో చైతూ నటనకు ఎలాంటి వంకలు పెట్టడానికీ లేదు. రాశీ ఖన్నాతో, చైతూ పతాక సన్నివేశాల చిత్రీకరణ చాలా బాగుంటుంది. రాశీఖన్నా పాత్రతోనే అసలు కథ మొదలవుతుంది. తన పాత్రకు బాగానే న్యాయం చేసింది రాశీ ఖన్నా. ఇక ఆ తర్వాత మాళవిక నాయర్, అవికా గోర్ పాత్రల్లో మాళవిక పాత్ర సహజంగా అందంగా సాగింది. అవికా పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ప్రకాష్ రాజ్, సుశాంత్ రెడ్డి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
పీ.సి. శ్రీరామ్ కెమెరా పనితనం గురించే ఎక్కువగా మాట్లాడుకోవాలి. కొన్ని సన్నివేశాలను అయితే, అబ్బుర పరిచేలా అందంగా కళ్లకు కట్టినట్టు చూపించాడు. థమన్ పాటలు పెద్దగా గుర్తు పెట్టుకొనేలా లేకపోయినా, కథానుగుణంగా ఆకట్టుకునేలా వున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయ్. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ఓ మ్యాజిక్ వుంటుంది. కానీ, ఆ తరహా కొత్త మ్యాజిక్ ఏదీ ఈ సినిమాలో చూపించలేకపోయాడు విక్రమ్ కుమార్.

విశ్లేషణ:
భావోద్వేగాలతో కూడిన అభిరామ్ ప్రయాణమే ‘థాంక్యూ’ కథ. జీవితంలో హీరో ఎదుర్కొంటూ వచ్చిన ఒక్కొక్క దశనీ హార్ట్ టచ్చింగ్‌గా ఆవిష్కరిస్తూ రావడమే ఈ సినిమా కాన్సెప్ట్. సినిమా చూస్తున్నంత సేపూ ‘ప్రేమమ్’ సినిమానే తలచుకుంటారు ఆడియన్స్. అయితే, ప్రేమమ్ మాదిరి హార్ట్ టచ్చింగ్ కథాంశాన్ని టచ్ చేయడంలో ఫెయిలయ్యాడు దర్శకుడు. ప్రేమ కంటే, జీవితం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అదే సినిమా రిజల్ట్‌ని అయోమయంలో పడేసేలా అనిపిస్తోంది. జీవితంలో ఎదగడానికి రకరకాల దశలో రకరకాల వ్యక్తులు కలుస్తుంటారు. మనం ఓ స్టేజ్‌కి వచ్చాకా, ఏదో ఒక సందర్భంలో వారికి థాంక్స్ చెప్పుకొని తీరాల్సిందే. అదే కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ప్రయత్నం పెద్దగా వర్కవుట్ అయినట్లుగా కనిపించలేదు. కథా గమనం ప్రేక్షకుడి అంచనాకి అందేస్తుంటుంది. దాంతో, కొన్ని సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయ్. 

ప్లస్ పాయింట్స్:
నాగ చైతన్య పర్‌ఫామెన్స్,
క్లైమాక్స్‌లో చైతూ, రాశీ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
దారి తప్పిన సెకండాఫ్

చివరిగా: పర్‌ఫామెన్స్ వైజ్‌గా చైతూ అదరగొట్టేశాడు. కానీ, నెరేషన్ విషయంలో ‘థాంక్యూ’ ఫెయిలైందని చెప్పొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com