ప్రపంచానికి శాంతిని, ఆనందాన్ని పంచే విశ్వగురువు భారతదేశం:ఉపరాష్ట్రపతి

- July 25, 2022 , by Maagulf
ప్రపంచానికి శాంతిని, ఆనందాన్ని పంచే విశ్వగురువు భారతదేశం:ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గంలో శాంతిని, ఆనందాన్ని పంచగలిగిన విశ్వగురువు భారతదేశమని, భారతీయ సంస్కృతిలోని సార్వత్రిక విలువలైన ఐక్యత, శాంతి, సామాజిక సామరస్యాలను పరిరక్షించుకునేందుకు, ప్రోత్సహించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో “సింగ్, డాన్స్, అండ్ ప్రే” పేరిట డాక్టర్ హిందోల్ సేన్ గుప్తా రూపొందించిన ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాద జీవిత చరిత్ర పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.శ్రీల ప్రభుపాద జీవితం స్ఫూర్తిదాయకమన్న ఉపరాష్ట్రపతి, వారి లాంటి గొప్పసాధువులు, ఆధ్యాత్మిక గురువులను స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణా లక్షణాలను అలవరచుకోవాలని సూచించారు.కుల, మత, ప్రాంత, లింగ బేధాల వంటి సంకుచిత భావాలకు అతీతంగా యువత ఎదగాలని ఆకాంక్షించిన ఉపరాష్ట్రపతి, సమాజంలో ఐక్యత, సామరస్యం, శాంతిని తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. 

ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో శ్రీల ప్రభుపాద విశేషమైన కృషి చేశారన్న ఉపరాష్ట్రపతి, భారత సాంస్కృతిక వారసత్వానికి రాయబారిగా ఆయనను వర్ణించారు. ఆధ్యాత్మికతే భారతదేశానికి గొప్పబలమన్న ఆయన, అదే మన దేశానికి ఆత్మ, మన నాగరికతకు పునాది అని తెలిపారు. ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు భగవద్గీత ఆధ్యాత్మిక పరిష్కారాన్నిచూపుతుందన్న ఉపరాష్ట్రపతి, భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నలు ప్రస్తుత సమాజంలో ప్రతి వ్యక్తికి ఎదురయ్యేవేనని తెలిపారు. 
భారతదేశాన్ని భక్తిభూమిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఇక్కడి ప్రజల రక్తంలో భక్తి అంతర్వాహినిగా ప్రవహిస్తోందని, భారతదేశ సామూహిక నాగరికత చైతన్యానికి భక్తి జీవనాడి అని పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన ఎందరో ఆధ్యాత్మికవేత్తలు సార్వత్రిక పూజా విధానం ద్వారా మత వివక్షలు లేని, ఆధ్యాత్మిక భావాలను ప్రజల్లో నాటారాని, వసుధైవ కుటుంబకం స్ఫూర్తిని ఇంటింటికీ చేరవేసేందుకు ఆయన కృషి చేశారన్నారు. 

శ్రీ కృష్ణ ఆలయానికి 10 మైళ్ళ దూరంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ప్రభుపాద స్ఫూర్తిని ఇస్కాన్ కొనసాగిస్తున్న తీరును అభినందించిన ఉపరాష్ట్రపతి, భారతీయ విలువల్లో కనిపించే షేర్ అండ్ కేర్ స్ఫూర్తికి ఇది ఆదర్శంగా నిలిచిందన్నారు. యువత ఈ దిశగా పయనించాలన్న ఆయన, పాఠశాల, కళాశాల స్థాయిలో సామాజిక సేవను తప్పనిసరి చేయాలని సూచించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ నేతృత్వంలో మధ్యాహ్న భోజన పథకాలకు అందుతున్న సేవలను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 

సింగ్, డాన్స్ అండ్ ప్రే పుస్తకాన్ని రచయించిన డా. హిందోల్ సేన్ గుప్తా, ఇస్కాన్ – బెంగళూరులను అభినందించిన ఉపరాష్ట్రపతి, శ్రీల ప్రభుపాద 125వ జయంతి సందర్భంగా ఇది వారికి అందించే సముచితమైన నివాళి అని తెలిపారు. ఈ స్ఫూర్తిని దైనందిన జీవితానికి అన్వయించుకునేలా పాఠకులకు ఈ పుస్తకం స్ఫూర్తిని పంచగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిట్ దాస్, వైస్ చైర్మన్ చంచలపతి దాస్, పుస్తకరచయిత డా. హిందోల్ సేన్ గుప్తా, ఇస్కాన్ సంస్థ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com