ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై మహిళా డ్రైవర్లు..

- July 26, 2022 , by Maagulf
ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై మహిళా డ్రైవర్లు..

అమరావతి: మాములుగా మహిళా కండక్టర్లే ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తుంటారు. అలాంటిది ఇకపై డ్రైవర్ స్థానంలో మహిళలు కనిపించబోతున్నారు. ఆ దిశగా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధంచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

దీనిపై ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ)లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. వారికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఇవ్వడంతో వారికి డ్రైవింగ్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చినందుకు గాను ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com