ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు నేడే ఆఖరు తేదీ

- July 31, 2022 , by Maagulf
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు నేడే ఆఖరు తేదీ

న్యూ ఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఇవాళ ఆఖరు తేదీ అని ఐటీ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. అందరూ రిటర్నులు దాఖలు చేశారని భావిస్తున్నామని తెలిపింది. లేకపోతే వెంటనే దాఖలు చేసి అపరాధ రుసుము నుంచి తప్పించుకోవాలని ట్విటర్ వేదికగా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలులో భారీ సంఖ్యలో ఫైల్ చేశారు. శనివారం నాటికి 5 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయని తెలిపింది. వీటిలో శనివారం ఒక్క రోజే 44.5 లక్షలకు పైగా రిటర్నులు దాఖలు చేశారని పేర్కొంది.

నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఏకంగా 4.48 లక్షల మంది ఐటీఆర్‌ దాఖలు చేసినట్టు తెలిపింది. 29న మొత్తం 4.52 కోట్ల రిటర్నులు దాఖలు అయినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఒక్క రోజే 43 లక్షల మంది రిటర్నులు ఫైల్‌ చేశారు. ఫైలింగ్‌కు సంబంధించి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించామన్నారు.

కొవిడ్‌, ఐటీ పోర్టల్‌లో సమస్యల కారణంగా గతేడాది డిసెంబర్‌ 31 వరకు రిటర్నుల దాఖలుకు గడువు పొడిగించారు.ఆ ఏడాది మొత్తం 5.89 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. ఈసారి కూడా భారీగా దాఖలైనట్టు ఐటీశాఖ తెలిపింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారు భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖతోపాటు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBDT) రిటర్నుల దాఖలు ప్రక్రియను నిరంతరం గమనిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

పోర్టల్ లో ఎలాంటి సమస్య రాకుండా సాంకేతిక నిపుణులతో ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు ఐటీ డిపార్ట్ మెంట్ సీనియర్ అధికారి తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రతి రోజూ పరిశీలించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రతి సమస్య, సందేహాలను వీలైనంత త్వరగా తీరుస్తామని చెప్పారు.

గడువు తేదీ పొడిగింపుపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఇప్పటివరకు ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ఎలాంటి ఇబ్బందులూ లేవన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే పాన్, ఫోన్ నెంబర్ వివరాలను [email protected]కు మెయిల్ చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com