మంకీపాక్స్‌ కేసులు..భారత్ ప్రత్యేక సూచనలు

- August 03, 2022 , by Maagulf
మంకీపాక్స్‌ కేసులు..భారత్ ప్రత్యేక సూచనలు

న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశం మొత్తం మీద 8 మంది ఈ వ్యాధి బారిన పడగా.. ఒకరు మృత్యువాత కూడా పడ్డారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌ను కట్టడి చేయడానికి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా కొన్ని సూచనలు కూడా చేసింది. మంకీపాక్స్‌ నివారణకు ఏం చేయాలో, ఏం చేయకూడదో బాధితులతో వ్యవహరించాలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ‘మంకీపాక్స్‌ బాధితులను ముట్టుకున్నా, వారికి సమీపంలో ఉన్నా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. దీని నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి.. ఏం చేయకూడదో ఒకసారి తెలుసుకుందాం’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో కొన్ని సూచనలు జారీ చేసింది.

ఇవి చేయండి..

  • మంకీపాక్స్‌ బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచండి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు వారు ఐసోలేషన్‌లోనే ఉండాలి.
  • బాధితులు మూడు లేయర్ల మాస్క్‌ ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.
  •  బాధితులకు దగ్గరకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి
  • ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంచేసుకోవాలి

ఇవి చేయద్దు..

  • మంకీపాక్స్‌ బాధితుల దుస్తులు, టవళ్లు, పడకను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులు ఉపయోగించకూడదు.
  • బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి శుభ్రం చేయకూడదు. వాటిని ప్రత్యేకంగా ఉతకాలి.
  • మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగవద్దు.
  • సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం, వార్తలను నమ్మవద్దు. అలాగే బాధితులపై వివక్ష చూపవద్దు అని కేంద్రం సూచించింది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com