నేను ప్రధానికి, ఈడీకి భయపడను: రాహుల్ గాంధీ
- August 04, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీకి, ఈడీకి తాను భయపడనని అన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఈడీ బుధవారం సీల్ చేసిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ బెదిరింపు ప్రయత్నాలు అని అన్నారు. “మోడీ ప్రభుత్వం కోరుకున్నది చేసుకోవచ్చు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటా. సత్యానికి అడ్డుకట్ట వేయలేం. ఏదైనా చేసుకోండి. నేను ప్రధానికి భయపడను. దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తాను. మాపై ఒత్తిడి చేయడం ద్వారా మమ్మల్ని ఆపవచ్చని అనుకుంటున్నారు. మేము మౌనంగా ఉండం. మోడీ, అమిత్ షా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏం చేసినా అడ్డుగా నిలబడతాం.”
కాగా, నేషనల్ హెరాల్డ్‌పై ఈడీ దాడులను కాంగ్రెస్ తప్పుపట్టింది. వాస్తవ అంశాలను మరుగునపరిచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ నేత అభిషేక్ మనుసింఘ్వి దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ దాడుల నేపధ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
మోడీ సర్కార్ అన్నింటినీ సీల్ వేసే ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. ఇలాంటి చవకబారు ఎత్తుగడలతో కేంద్రం తమ గొంతులను నొక్కలేదని సింఘ్వి పేర్కొన్నారు. విపక్షంగా తమ బాధ్యత నుంచి తాము ఎప్పుడూ పక్కకు తప్పుకోబోమని స్పష్టం చేశారు. మీరు ఎంతగా తమను అణిచివేయాలని చూసినా మీ తప్పిదాలను బయటపెడుతూనే ఉంటామని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కక్షపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడటం ప్రజాస్వామ్య విధానం కాదని, తాము ఎక్కడికి పారిపోవడం లేదని వారు గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







