‘సీతారామం’ మూవీ రివ్యూ

- August 05, 2022 , by Maagulf
‘సీతారామం’ మూవీ రివ్యూ

నటీనటులు: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మికా మండన్నా, విష్ణు శర్మ, సచిన్ ఖేడ్కర్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు.
దర్శకత్వం: హను రాఘవపూడి,
నిర్మాణం: వైజయంతీ మూవీస్ బ్యానర్,

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. ఈ సినిమాపై మొదట్నుంచీ పాజిటివ్ బజ్ ఏర్పడింది. బహుశా వైజయంతీ మూవీస్ వంటి పెద్ద బ్యానర్‌లో రూపొందడం వల్లనో లేదంటే, దర్శకుడిగా హను రాఘవ పూడి మీద వున్న నమ్మకం వల్లనో కావచ్చు. అయితే, ఆ బజ్‌ని ఈ సినిమా రిలీజ్ తర్వాత అందుకుందో లేదో తెలియాలంటే, కథలోకి వెళ్లాల్సిందే.

కథ: 
రామ్ (దుల్కర్ సల్మాన్) ఓ అనాధ. దేశం, సైన్యం, యుద్దం తప్ప ఇంకేం తెలీవు. పాకిస్థాన్‌లో ఓ వుత్తరం, ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తుంటుంది. హైద్రాబాద్‌లోని సీతామాలక్హ్మి (మృణాల్ ఠాకూర్) కోసం రామ్ రాసిన వుత్తరం అంది. ఆ వుత్తరాన్ని గమ్యం చేర్చాల్సిన బాధ్యత ఆఫ్రిన్ (రష్మికా మండన్నా) పై పడుతుంది. ఆమె తాతయ్య (సచిన్ ఖేడ్కర్) చివరి కోరిక అది. ఆ వుత్తరాన్ని అనుకున్న చోటికి చేరిస్తేనే తాతయ్య ఆస్థి ఆఫ్రిన్‌కి దక్కుతుంది. దాంతో ఇష్టం లేకపోయినా, ఆ వుత్తరాన్ని సీతామాలక్ష్మి వద్దకు చేర్చే బాధ్యత తీసుకుంటుంది ఆఫ్రిన్. ఈ ప్రయాణంలో సీతామాలక్ష్మి గురించీ, రామ్ గురించీ, వారిద్దరి మధ్య వున్న అపురూపమైన అందమైన ప్రేమ గురించి తెలుసుకుంటుంది ఆఫ్రిన్. దేశం, సైన్యం మాత్రమే తన జీవితంగా భావించే రామ్‌కి సడెన్‌గా ఒకసారి వుత్తరం వస్తుంది. ఆ తర్వాత నుంచి వుత్తరాలు వస్తూనే వుంటాయ్. సడెన్‌గా ఒకసారి సీతామాలక్ష్మిని కలుస్తాడు రామ్. వారిద్దరి మధ్యా స్నేహం, ప్రేమగా మారుతుంది. ‘పెళ్లి చేసుకుంటావా.? అని అడిగితే, సీత నుంచి రామ్‌కి సమాధానం రాదు. అందుకు కారణం ఏంటీ.? మధ్యలో రామ్, సీత ఎందుకు విడిపోయారు.? మళ్లీ కలిశారా.? లేదా.? సీత కోసం రామ్ రాసిన వుత్తరం పాకిస్థాన్‌లోనే ఎందుకు వుండిపోయింది.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘సీతారామం’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే:
రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. తన అందంతో, ఆహార్యంతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. మృణాల్ ఠాకూర్ సీతగా మైమరిపించేసింది. స్లో పోయిజన్‌లా ప్రేక్షకుడికి ఆమె పాత్ర గుర్తుండిపోతుంది. ఇక రష్మికా మండన్నా పొగరున్న అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది. కథ నడుస్తున్ కొద్దీ, తన పాత్రలో వేరియేషన్స్ చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా ఇన్ని సినిమాలు చేసిందీ ఓ ఎత్తు. ఈ సినిమాలో రష్మికా పాత్ర మరో ఎత్తు, కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సునీల్, వెన్నెల కిషోర్, విష్ణు శర్మ పాత్రలు ఎవరికి వారే తమ అనుభవాన్ని రంగరించి పోషించారు. 

సాంకేతిక వర్గం పని తీరు:
సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా కనిపించింది. నిర్మాణ విలువలకు ఎక్కడా వంకలు పెట్టడానికి లేదు. విజువల్స్ చాలా రియలిస్టిక్‌గా వున్నాయి. గ్రాఫిక్స్ కూడా, రియాల్టీని తలపించాయ్. యుద్ధ సన్నివేశాలు, కశ్మీర్ అందాలూ, లొకేషన్లూ అన్నీ అబ్బురపరుస్తాయ్. మాటలు కవితల్లా శ్యావ్యంగా వినిపిస్తాయ్. మ్యూజిక్ కథలో భాగమైపోయింది. ‘ఇంతందం’ పాట తెరపై అద్భుతంగా వుంది. 1965, 1985 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ కాలంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిపోయారు. క్లైమాక్స్ చివరి 30 నిముషాలు ప్రేక్షకున్ని ఉత్సుకతతో నిలబెట్టేశాడు. చాలా బలమైన కథని, ఎక్కడా దొర్లిపోకుండా ఎంతో ఇంటలెక్చువల్‌గా తెరకెక్కించడంలో హను రాఘవపూడి హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు. 
మూడు మూతి ముద్దులు, ఆరు గాఢమైన హగ్గులూ లేకుండా ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కించలేని పరిస్థితి. ఆ ఫార్ములాకి పూర్తి భిన్నంగా ‘సీతారామం’ ఓ క్లీన్ లవ్ స్టోరీ. 
ఓన్లీ ప్లస్ పాయింట్స్, అసలు మైనస్ పాయింట్సే లేని అందమైన అద్భుతమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఖచ్చితంగా ధియేటర్‌కి వెళ్లి హాయిగా చూడదగ్గ సినిమా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com