ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యాదక్షత అందరికీ మార్గదర్శనం: ప్రధాని మోడి

- August 08, 2022 , by Maagulf
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యాదక్షత అందరికీ మార్గదర్శనం: ప్రధాని మోడి

న్యూ ఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తన సుదీర్ఘ అనుభవంతో దేశానికి సేవ చేశారని ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. పార్లమెంటులో సోమవారం వెంకయ్య నాయుడు వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గురించి సభలో ప్రధాని మాట్లాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపించారు.

‘‘వెంకయ్య నాయుడు దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన ఎప్పుడూ యువత భవిష్యత్తు కోసం తపించారు. ఆయన నుంచి ఈ దేశ యువత ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించాను అన్నారు. కానీ.. ప్రజా జీవితం నుంచి కాదు. రాజ్యసభకు వెంకయ్య సేవలు ముగుస్తున్నాయేమో. కానీ, ఆయన అనుభవాలు ఉపయోగపడతాయి. ఆయన మాటల్లో వన్ లైనర్స్ ఎంతో బాగుంటాయి. అవి వన్ లైనర్స్ కాదు. విన్ లైనర్స్ కూడా. ఆ ఒక్క మాటలోనే ఎంతో అర్థం ఉంటుంది. వాటికి ఎదురు చెప్పలేం. ఆయనతో పార్లమెంటులో ఎన్నో చారిత్రక సందర్భాల్లో భాగస్వాములయ్యాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని ప్రధాని అన్నారు.

ఆయన తన పదవీ కాలంలో సభను ఎంతో విజయవంతంగా నడిపించారని ప్రశంసించారు. రాజ్యసభ సచివాలయంలో కూడా పలు మార్పులు తెచ్చారన్నారు. వెంకయ్య నిబద్ధత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, ఆయన్ను చూసి నేటి తరం ఎంతో నేర్చుకోవాలని ప్రధాని సూచించారు. వెంకయ్య నాయుడు పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆయన తర్వాత జగదీప్ ధన్‌కర్ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com