ఒంగోలు తెలుగు తేజం-సింగపూరులో ఘనంగా భరతనాట్య రంగప్రవేశం

- August 14, 2022 , by Maagulf
ఒంగోలు తెలుగు తేజం-సింగపూరులో ఘనంగా భరతనాట్య రంగప్రవేశం

సింగపూర్: ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామానికి చెందిన గుడిదేని సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్‌లో ఘనంగా జరిగింది. ప్రాచీన నాట్య కళలకు ప్రోత్సాహం కరువైన ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం ప్రదర్శించిన తీరు ఆద్యంతం బహు రమణీయంగా సాగింది. ఆగస్టు 13వ తేదీన సింగపూర్‌‌లోని నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి తేజస్వి  ప్రేక్షకులను తన నాట్యకౌశలంతో అలరించింది. ఐదేళ్ల వయస్సులో మొదలైన నాట్యపుటడుగులు ఇప్పుడు రంగప్రవేశం చేశాయి. చెల్లెలు ఖ్యాతిశ్రీ ఆలపించిన గణేశ ప్రార్ధనా గీతంతో కార్యక్రమం మొదలు కాగా, విష్ణు ఆవాహనంతో నృత్యప్రదర్శన ప్రారంభమై, వర్ణం, పదం, అభంగ్, జావళి, థిల్లాన నాట్య అంశాలతో నృత్యప్రదర్శన అత్యంత ఆకర్షణీయంగా, కనులవిందుగా సాగింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో మూడు గంటలపాటు ప్రేక్షకులను ముగ్దులనుచేసింది. గురువు శ్రీలిజీ శ్రీధరన్ నృత్యాలకు సుందరంగా రూపకల్పన చేశారు.

సాయి తేజస్వి ఎనిమిది ఏళ్ళ వయస్సులోనే అనేక అంతర్జాతీయ నృత్య కార్యక్రమాలలో విజేతగా అవార్డులు పొందారు, 2019లో త్యాగయ్య టీవీ నిర్వహించిన కార్యక్రమంలో నాట్యశిరోమణి బిరుదు పొందింది. గౌరవ అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ గ్రహీత, కూచిపూడి గురువర్యులు పద్మజా రెడ్డి సాయితేజస్విని మెండు ప్రశంసలతో దీవించారు. శాస్త్రీయ నాట్య కోవిదుల మన్నలను సాయి తేజస్వి అందుకుంది. ప్రత్యేక అతిథులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి వెంకట్ పద్మనాధన్, కళాక్షేత్ర గురువర్యులు సీతారాజన్, ఆత్మీయ అతిథులుగా విదూషి డా.ఎమ్.ఎస్. శ్రీలక్ష్మి, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, సామాజిక కార్యకర్త సునీత రెడ్డి హాజరయి సాయి తేజస్వికి దీవనెలతోపాటు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సాయి తేజస్వి తల్లిదండ్రులు గుడిదేని వీరభద్రయ్య, పావని నిర్వహించగా, నాయనమ్మ గుడిదేని గోవిందమ్మ కూడా హాజరై సాయి తేజస్వికి ఆశీస్సులు అందించారు.500 మందికి పైగా పాల్గొని  హృద్యంగా సాగిన ఈ కార్యక్రమం బహు జనరంజకం, భావితరానికి స్ఫూర్తిదాయకం, భరత కళలకు గర్వకారణం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com