హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మూడు వియత్నాం నగరాలకు కనెక్షన్

- August 29, 2022 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మూడు వియత్నాం నగరాలకు కనెక్షన్

హైదరాబాద్: ప్రకృతి సౌందర్యం, విలక్షణమైన ఆర్చిటెక్చర్, రుచికరమైన ఆహారంతో నిండిన అనుభవం కోసం సిద్ధంగా ఉన్నారా? మీరు ఇప్పుడు సామ్ మౌంటైన్, హలోంగ్ బేలోని అద్భుతమైన, రైస్ టెర్రేస్‌లు, బీచ్‌లలోని అందాలను ఆస్వాదించవచ్చు. వియత్నాం ఇప్పుడు ముత్యాల నగరానికి కేవలం నాలుగు గంటల దూరంలో ఉంది. రానున్న అక్టోబర్‌లో, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హనోయి, హో చి మిన్, డా నాంగ్‌ నగరాలకు వియట్‌జెట్ ఎయిర్‌ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించేందుకు సిద్ధమైంది. వియట్‌జెట్ వియత్నాంలోని పలు నగరాలకు తన నాన్‌స్టాప్ సర్వీస్‌ను ప్రారంభించనున్న దక్షిణ భారతదేశంలోని మొదటి విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. 

హనోయికి అక్టోబర్ 7న, హో చి మిన్ సిటీకి అక్టోబర్ 9న, డా.నాంగ్‌కు నవంబర్ 29న వియట్‌జెట్ తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ప్రముఖ వియత్నాం నగరాల మధ్య వారానికి నాలుగు సార్లు ఈ విమాన సర్వీసులు ఉంటాయి.

కొత్త వియట్‌జెట్ సర్వీసులపై GHIAL, CEO, ప్రదీప్ పణికర్, “గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ ప్రయాణాల సంఖ్య క్రమంగా పుంజుకుంటోంది. భారతీయ ప్రయాణికులు ఇతరదేశ గమ్యస్థానాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ని వియత్నాంతో కలుపుతున్న వియట్‌జెట్ కొత్త డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు విశ్రాంతి పర్యాటకాన్ని పెంచడమే కాకుండా ఇతర రంగాలలో వ్యాపార, వాణిజ్యాన్ని సులభతరం చేస్తాయి. ఈ సర్వీసులు వియత్నాంలో పర్యాటక అనుభవాన్ని కోరుకుంటున్న మన ప్రాంతపు ప్రయాణికులకు ఉత్సాహాన్నిస్తాయి’’ అన్నారు.

కొత్త మార్గాల గురించి, వియట్‌జెట్ కమర్షియల్ డైరెక్టర్ జే ఎల్ లింగేశ్వర, “ఈ అక్టోబర్‌లో హైదరాబాద్ నుండి కొత్త డైరెక్ట్ ఫ్లైట్‌లతో భారతదేశంలో మా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ ప్రయాణీకుల నుండి వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉంది. ఆగ్నేయ మరియు ఈశాన్య ఆసియా గమ్యస్థానాలకు వారధిగా ఉన్న వియత్నాం సౌందర్యాన్ని ఆస్వాదించాలని మేం ఆహ్వానిస్తున్నాము. ముత్యాల నగరమైన హైదరాబాద్, ఢిల్లీ మరియు ముంబైలతో పాటు మరొక హైలైట్ అవుతుంది. మా భారతదేశం-వియత్నాం ఫ్లైట్ నెట్‌వర్క్‌ను ఈ సంవత్సరం చివరి నాటికి 17 మార్గాలకు విస్తరిస్తాము.’’ అన్నారు.

వియత్నాం ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. వియత్నాం ఆర్థికాభివృద్ధికి పర్యాటకం కీలకమైనది.  కోవిడ్ అనంతర కాలంలో భారతదేశం, వియత్నాంల మధ్య వాణిజ్యం, పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ‘వీసా ఆన్ అరైవల్’తో  భారతీయ పౌరులు వియత్నాం వీసా పొందడం గతంలో కంటే ఇప్పుడు సులభం.  

కోవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో, జూలైలో 3.5 లక్షల మంది అంతర్జాతీయ సందర్శకులు వియత్నాంను సందర్శించారు, అంతకు ముందు నెలతో పోలిస్తే ఇది 49% పెరుగుదల. వియత్నాం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.

సెలవులను ఆస్వాదించే వారు, ప్రకృతి ప్రేమికులు, ఔత్సాహికుల కోసం వియత్నాంలో అందమైన బీచ్‌లు, అద్భుతమైన పర్వతాలు, సరస్సులు ఉన్నాయి. వియత్నాంలో విస్తృత జీవవైవిధ్యంతో పాటు, ఇక్కడ ఎనిమిది అద్భుతమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అనేక దేశాలకు MICE (Meetings, Incentives, Conferences and Exhibitions) కోసం వియత్నాం మొదటి ఎంపికగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార ప్రయాణీకులకు కీలక ప్రదేశంగా అభివృద్ధి చెందుతోంది.  

దేశంలో అతి తక్కువ వయసున్న రాష్ట్రమైన తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలు, నోరూరించే వంటకాలకు ప్రసిద్ధి. కొత్తగా నిర్మించిన బుద్ధవనం (మెగా బౌద్ధ థీమ్ పార్క్) నుండి, యాదాద్రి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన రామప్ప దేవాలయం వరకు; కులీ కుతుబ్ షా సమాధులు తారామతి బారాదరి సరాయ్ లాంటి వాటి వరకు తెలంగాణ అన్ని మతాల ప్రార్థనా స్థలాలకు ప్రసిద్ధి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నందికొండ, దేవునిగుట్ట, ధర్మపురి, అమరావతి, నాగార్జున కొండ మరియు భట్టిప్రోలు వంటి బౌద్ధ ప్రదేశాలకు ప్రసిద్ధి చెందాయి, ఇవి పర్యాటకులకు ఆధ్యాత్మికత, ప్రశాంతతను అందిస్తాయి. తీర్థయాత్ర కేంద్రాలు, ఎగసిపడే జలపాతాలు, మంత్రముగ్ధులను చేసే కొండలు, సరస్సులు, వన్యప్రాణుల అభయారణ్యం, స్మారక చిహ్నాలను కలిగిన తెలంగాణ అంతర్జాతీయ ప్రయాణికులకు చిరస్మరణీయ అనుభూతిని ఇస్తుంది.

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తృతమైన రూట్ నెట్‌వర్క్, ప్రయాణీకులు ఎంచుకోవడానికి పలు ఎయిర్‌లైన్‌ల ఎంపికతో, దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ‘గేట్‌వే ఆఫ్ చాయిస్’గా స్థిరపడింది.బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి నగరాలకు దగ్గరగా ఉండడం కారణంగా హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ మరియు దేశీయ గమ్యస్థానాలకు వెళ్లే విమాన ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఈ విమానాశ్రయం ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్ మార్గం మరియు హైదరాబాద్‌లోని ప్రైమరీ, సెకెండరీ బిజినెస్ డిస్ట్రిక్ లతో ఎలివేటెడ్ కారిడార్‌తో అనుసంధానించబడి ఉంది. ప్రస్తుతం 150 కంటే ఎక్కువ బస్సులు 24 గంటలూ విమానాశ్రయం నుంచి తిరుగుతున్నాయి. పర్యాటకుల పెరుగుదలతో, విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి ఖాట్మండు, ఫుకెట్, మెడాన్, బాలి, అడిస్ అబాబాలకు లాంటి గమ్యస్థానాలకు నూతన సర్వీసులను అన్వేషిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com