ఏపీలోని కోస్తా తీరం కొత్తరూపు సంతరించుకోనుంది..
- April 16, 2016
సాగరమాల ప్రాజెక్టులో చేర్చిన కేంద్రం విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకూ మహర్దశ రోడ్డు, రైలు మార్గాలతో భారీ అనుసంధాన ప్రణాళికలు నౌకాయాన సరుకు రవాణాలో దేశంలో ఏపీకి 3వ స్థానం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగర మాల ప్రాజెక్టు ద్వారా ఏపీలోని కోస్తా తీరం కొత్తరూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నౌకాశ్రయాలను అభివృద్ధి చేయటంతో పాటు కొత్తగా రెండు పోర్టుల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టనుంది. సాగర మాల దృక్కోణ ప్రణాళిక(పర్‌స్పెక్టివ్ ప్లాన్)ను ప్రధాన మోదీ విడుదల చేశారు. దీని ప్రకారం.. దేశంలో నౌకాయానం ద్వారా ఏటా 42.8 కోట్ల టన్నుల సరకు రవాణాతో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉండగా, 15.3 కోట్ల టన్నుల సరకు రవాణాతో మహారాష్ట్ర రెండో స్థానం, 14.1 కోట్ల టన్నుల సరకు రవాణాతో ఏపీ మూడో స్థానంలో ఉన్నాయి. దేశంలో అత్యంత సుదీర్ఘ కోస్తా తీరం ఉన్నా నౌకాశ్రయాలు లేని ప్రాంతాలు ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో ఉన్నాయని కేంద్రం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో నౌకాశ్రయాలను నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఏపీలో మచిలీపట్నం, వాడరేవు, తమిళనాడులో కడలూర్, సిర్కాళి, కర్ణాటకలో బెళెకెరి నౌకాశ్రయాలను గుర్తించింది. మచిలీపట్నం, వాడరేవు నౌకాశ్రయాల ద్వారా థర్మల్ కోల్, సిమెంటు, కంటైనర్ల రవాణా జరుగుతోందని పేర్కొంది. సాగరమాల ప్రాజెక్టులో ప్రతిపాదిత వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏపీలో 2 భాగాలుగా గుర్తించారు. మొదటి భాగం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. కృష్ణపట్నం పోర్టు దీని పరిధిలోకి వస్తుంది. ప్రధానంగా ఎలకా్ట్రనిక్స్ వస్తువులను ఈ పోర్టు నుంచి ఎగుమతి చేస్తారు. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టు నుంచి నెల్లూరు నగరం, నాయుడుపేటలకు రోడ్డు, రైలు మార్గాలను మెరుగుపరుస్తారు. నౌకాశ్రయాల సామర్థ్య పెంపులో భాగంగా కృష్ణపట్నం పోర్టుకు తగినన్ని అనుసంధాన రైల్వే లైన్లను నిర్మించనున్నారు. ఈ కారిడార్ రెండో భాగం.. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. ఇందులో పెట్రోకెమికల్, సిమెంట్, ఆటోమోటివ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలకా్ట్రనిక్స్, జౌళి, తోలు ఉత్పత్తులు, చెప్పులు, బూట్లు, గృహోపకరణాల తయారీ పరిశ్రమలు నెలకొల్పుతారు. ఈ పరిశ్రమలను కూడా నౌకాశ్రయాలతో అనుసంధానిస్తారు. మచిలీపట్నం, వాడరేవు నౌకాశ్రయాలకుజాతీయ రహదారులను, రైల్వే లైన్లను నిర్మిస్తారు. మచిలీపట్నం పోర్టు నుంచి సమీపంలోని జాతీయ రహదారులన్నింటినీ ఆరు లైన్ల రోడ్డుతో అనుసంధానిస్తారు. విశాఖలో చమురు జెట్టీని ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌కు చమురు పైప్‌లైన్ సాగర మాల ప్రాజెక్టులో పైపులైన్ల నిర్మాణం కూడా అంతర్భాగం. దేశంలో ద్రవరూప సరుకు రవాణాకు పైపులైన్లను ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై చమురు శుద్ధి కేంద్రాల సామర్థ్య పెంపుతో పాటు పైపులైన్ల నిర్మాణాన్ని కూడా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందు లో భాగంగా గుజరాత్‌లోని సలయా నుంచి మథుర వరకు పైపులైను విస్తరణ చేపట్టనుంది. పారదీప్ పోర్టు నుంచి హైదరాబాద్ వరకు మరో పైపులైన్‌ను నిర్మించనుంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్‌లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







