బ్రిటన్ రాజుగా చార్లెస్!

- September 09, 2022 , by Maagulf
బ్రిటన్ రాజుగా చార్లెస్!

లండన్: బ్రిటన్ ను సుదీర్ఘ కాలం పాలించిన రాణి ఎలిజబెత్‌-2 అస్తమయం తర్వాత యూకే ఇక రాజు పాలనలోకి వెళ్లనుంది. ఎలిజబెత్2 పెద్ద కుమారుడు చార్లెస్‌ (73) బ్రిటన్‌కు కొత్త రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన కింగ్‌ చార్లెస్-3గా వ్యవహరించనున్నారు. బ్రిటన్ రాజకుటుంబ నియమాల ప్రకారం.. దేశాధినేత మరణిస్తే వారి మొదటి వారసుడు/వారసురాలు రాజు/రాణిగా మారిపోతారు. అధికారికంగా పట్టాభిషేకం, లాంఛనాలకు కొన్ని నెలల సమయం పడుతుంది. అయితే, రాజు/రాణి మరణించిన 24 గంటల్లోపే కొత్త అధినేత పేరును లండన్ లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి యాక్సెషన్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత కొత్త రాజుకు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు విధేయత ప్రకటిస్తారు. కొత్త రాజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ విషయాన్ని బ్రిటన్ లో బహిరంగంగా ప్రకటన చేస్తారు.

వేల్స్‌ కు గతంలో యువరాజుగా వ్యవహరించిన చార్లెస్‌ ఇప్పుడు బ్రిటన్ కు అధినేతగా వ్యవహరిస్తారు. ఇకపై 14 కామన్వెల్త్‌ దేశాలకు రాజుగా కూడా ఉంటారు. చార్లెస్‌ 1948 నవంబరు 14న బకింగ్‌హామ్‌ ప్యాలెస్ లో జన్మించారు. ఎలిజబెత్‌-2 నలుగురు పిల్లల్లో ఆయనే పెద్దవారు. చార్లెస్‌ 1981లో డయానాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు విలియమ్‌, హ్యారీ ఉన్నారు. అయితే, 1992లో చార్లెస్ -డయానా దంపతులు విడిపోయారు. 1997లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డయానా మృతి చెందారు. ఈ విషయంలో చార్లెస్‌ విమర్శలను ఎదుర్కొన్నారు. 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్‌.. కెమెల్లా పార్కర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com