‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ

- September 09, 2022 , by Maagulf
‘ఒకే ఒక జీవితం’ మూవీ రివ్యూ

నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు
డైరెక్టర్: శ్రీ కార్తిక్
ప్రొడ్యూసర్: ఎస్,ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు
మ్యూజిక్: జాక్స్ బెజోయ్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్

శర్వానంద్, రీతూ వర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. పెద్దగా అంచనాల్లేకపోయినా, సినిమాలో ఏదో కొత్త విషయం వుందన్న క్యూరియాసిటీ క్రియేట్ చేశారు ప్రమోషన్లతో. కట్ చేస్తే ఇదో టైమ్ మిషన్ కథ అనీ తెలిసింది. టైమ్ మిషన్ నేపథ్యంలో చాలా కథలే వచ్చాయ్. ‘ఆదిత్య 369’ నుంచి నిన్న, మొన్నటి ‘బింబిసార’ వరకూ. కానీ ‘ఒకే ఒక జీవితం’ నిజంగానే ఓ కొత్త కథ. టైమ్ మిషన్ కథకు అమ్మ సెంటిమెంట్‌తో ఆధ్యం పోశారు. మరి ఈ కొత్త ప్రయోగం వర్కవుట్ అయ్యిందా.? తెలియాలంటే ‘ఒకే ఒక జీవితం’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
ఆది (శర్వానంద్) ఓ సంగీతకారుడు. కానీ, స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. ఒక్కడు వున్నప్పుడు చాలా బాగా పాడతాడు కానీ, జనాన్ని చూసి బిగుసుకుపోతాడు. అమ్మ తన పక్కన వుంటే ధైర్యంగా వుంటాననుకుంటాడు. కానీ, 20 ఏళ్ల క్రితమే యాక్సిడెంట్‌లో తల్లి చనిపోతుంది. శ్రీను (వెన్నెల కిషోర్) ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అందరూ తనను బ్రోకర్ అని పిలవడం అస్సలు నచ్చదు. చిన్నతనంలో బాగా చదువుకుని వుంటే ఆ పాట్లు వుండేవి కాదు కదా అనుకుంటాడు. చైతూ (ప్రియదర్శి) చిన్నతనంలో తాను రిజక్ట్ చేసిన అమ్మాయి పెద్దయ్యాకా చాలా అందంగా వుండడం చూసి, అరెరే చిన్నప్పుడే ఆ అమ్మాయి ప్రేమను పొంది వుంటే బాగుండేది కదా అనుకుంటాడు. పాల్ (నాజర్) ఓ సైంటిస్ట్. టైమ్ మిషన్‌పై కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తుంటాడు. ఈ ముగ్గురికీ పాల్‌తో ఎలా పరిచయమైంది.? గతంలో మిస్ అయిన జీవితాన్ని, వర్తమానంలో ఈ ముగ్గురూ దక్కించుకున్నారా.? గతంలోకి వెళ్లి తప్పులు సరిదిద్దుకున్నారా.? లేక కొత్త తప్పులేమైనా చేసి కష్టాలు కోరి తెచ్చుకున్నారా.? తెలియాలంటే ‘ఒకే ఒక జీవితం’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
శర్వానంద్ మంచి నటుడు అందులో నో డౌట్. ఈ సినిమా శర్వాని మరో మెట్టు పైకెక్కించిందని చెప్పడం అతిశయోక్తి అనిపించదేమో. అమ్మ సెంటిమెంట్‌ని పండించడంలో శర్వానంద్ నూటికి నూట యాభై మార్కలు వేయించేసుకున్నాడు. హీరోయిన్‌గా రీతూ వర్మ ఓకే. పెద్దగా ప్రాముఖ్యత లేదు రీతూ పాత్రకి. సినిమాకి ప్రాణం అమల పాత్ర. అమ్మ పాత్రలోని వేరియేషన్స్‌ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది అమల. తన అనుభవాన్నంతా రంగరించి వదిలి పెట్టింది. వెన్నెల కిషోర్ తన పాత్రతో నవ్వులు పూయిస్తూనే అక్కడక్కడా చిన్న చిన్న సెంటిమెంట్ డైలాగులతోనూ కట్టి పడేశాడు. ప్రియదర్శి పాత్ర పరిధి మేరకు బాగానే ఆకట్టుకుంటుంది. కానీ, ఇంకా బాగా డిజైన్ చేసి వుంటే బాగుండేది ఈ పాత్రను. నాజర్ తన పాత్రలో ఒదిగిపోయారు ఎప్పటిలాగే. మిగిలిన పాత్ర ధారులు తమ తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ పాతదే అయినా, ఫార్మేట్ కొత్తగా తీసుకున్నాడు డైరెక్టర్. అమ్మ సెంటిమెంట్‌ అంటే సహజంగానే హృద్యంగా వుంటుంది. ఆ లాజిక్ మిస్ కాకుండా, డబ్బులు పెట్టి ధియేటర్‌కి వచ్చిన ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేసేలా కథను చాలా తెలివిగా ముందుకు నడిపాడు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కడెక్కడ వాడాలో అక్కడి వాడి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. అయితే, క్లైమాక్స్‌పై ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి వుంటే బాగుండేదనిపిస్తుంది. హీరో పాత్ర సంగీతకారుడు కాబట్టి, పాటల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని వుంటే బాగుండేది. ధియేటర్లో వున్నంత సేపూ తప్ప బయటికొచ్చాకా ఒక్క పాట కూడా గుర్తుండదు. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయ్. 

ప్లస్ పాయింట్స్:
కథ, కొత్త ఫార్మేట్,
ఫస్టాఫ్, క్యారెక్టర్ డిజైన్స్,
శర్వానంద్ నటన,
ఇంటర్వెల్ బ్యాంగ్, 

మైనస్ పాయింట్స్:
కొద్దిగా సాగతీతలా తోచిన సెకండాఫ్,
మ్యూజిక్

చివరిగా: 
టైమ్ ట్రావెల్, అమ్మ సెంటిమెంట్ రెండూ పూర్తిగా విభిన్నమైన కథనాలు. అలాంటిది ఆ రెండింటినీ మిక్స్ చేయడం ద్వారా ఆడియన్స్‌ని కన్విన్స్ చేయడమన్నది అంత ఆషా మాషీ సవాల్ కాదు. సో ఒకసారి ధియేటర్లో ఈ సినిమా చూసేందుకు ఎలాంటి మొహమాటం అవసరం లేదు. పెట్టిన టిక్కెట్టుకు పక్కా న్యాయం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com