‘బ్రహ్మాస్త్ర’ మూవీ రివ్యూ

- September 09, 2022 , by Maagulf
‘బ్రహ్మాస్త్ర’ మూవీ రివ్యూ

నటీనటులు: రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ తదితరులు..
డైరెక్టర్: అయాన్ ముఖర్జీ,
ప్రొడక్షన్: స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్

బాలీవుడ్‌కి ఈ మధ్య ఏదీ కలిసి రావడం లేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయ్. ఈ తరుణంలో కోటి ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ప్యాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేశారు ఈ సినిమాని. రెండు కానీ, మూడు పార్టులుగా గానీ ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.మరి, అనుకున్న విధంగా భారీ అంచనాల్ని ఈ సినిమా అందుకుందా.? బాలీవుడ్‌ని ఆదుకుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ: 
దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడే అత్యున్నతమైన బ్రహ్మాస్త్రాన్ని రక్షించడం తమ ప్రాధమిక కర్తవ్యంగా పెట్టుకుంటారు ప్రాచీన భారతదేశం నుంచి వచ్చిన మహా రుషులు. ఆ క్రమంలోనే దుష్టుల చేతికి చిక్కకుండా వుండేందుకు బ్రహ్మాస్త్రాన్ని మూడు ముక్కలుగా చేసి రహస్యంగా భద్రపరుస్తారు. తర్వాత గురు (అమితాబ్ బచ్చన్)తో కలిసి రహస్య సంఘంగా జీవనం సాగిస్తుంటారు. జునూన్ (మౌనీ రాయ్) చీకటి సామ్రాజ్యానికి రాణి. ఎలాగైనా ఆ బ్రహ్మాస్ర్తాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో వుంటుంది. ఆగ్నేయాస్త్రం ద్వారా ఆశీర్వదించబడిన శివ (రణ్‌బీర్ కపూర్), ఇషా (అలియా భట్) ప్రేమని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. గురు అభ్యర్ధనల మేరకు బ్రహ్మాస్ర్తాన్నీ, ప్రపంచాన్నిరక్షించే బాధ్యత తీసుకుంటాడు. ఈ క్రమంలో విధితో పోరాడాల్సి వస్తుంది. మరి, తన ప్రయాణంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రపంచాన్ని శివ రక్షించగలిగాడా.? తెలియాలంటే ‘బ్రహ్మాస్ర్త’ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:
శివ పాత్రలో రణ్‌బీర్ కపూర్ చాలా ఇంటెన్సింగ్‌గా కనిపించాడు. రణ్‌బీర్ కళ్లే శివ పాత్రకు ప్రాణం పోశాయ్. ఇషాగా అలియా భట్ చాలా అందంగా అద్భుతంగా నటించింది. చీకటి సామ్రాజ్యానికి రాణిగా అత్యంత క్రూరమైన పాత్రలో మౌనీ రాయ్ ఒదిగిపోయింది. బుల్లితెరపై ఆమె పోషించిన నాగిని పాత్ర ఈ పాత్రలో అంతలా ఒదిగిపోయేందుకు బాగా వుపయోగపడిందని చెప్పొచ్చేమో. గురు‌గా అమితాబ్ బచ్చన్ సహజ సిద్ధమైన పాత్రలో కనిపించారు. అలాగే నాగార్జున నంది అస్ర్త పాత్రలో తన వంతు న్యాయం చేశారు. సూపర్ హ్యూమన్‌గా షారూఖ్ ఖాన్ స్పెషల్ రోల్ ఈ సినిమాకి మరో ఎస్సెట్. మిగిలిన పాత్రధారులందరూ తమ తమ పరిధుల మేరకు బాగా నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పని తీరు:
విజువల్స్ బాగున్నాయ్. కానీ, డైరెక్టర్ తాను ఎంచుకున్న ఫాంటసీ కథని ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడనే టాక్ వినిపిస్తోంది.రాజమౌళి హస్తం కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది.ప్రమోషన్లలో వున్న సీను, సినిమా, కథా, కథనాల్లో లేకపోయేసరికి ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్‌కే ప్రేక్షకులు పెదవి విరిచేశారు. నిర్మాణ విలువలు బాగానే వున్నప్పటికీ రిలీజ్‌కి ముందు ఊదరగొట్టడంతో అంచనాలను అందుకోలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్‌లో చాలా కత్తెర్లు పడాల్సింది.అంతా సాగతీతలా తోస్తుంది.సినిమాటోగ్రఫీ స్థాయి కూడా సరిపోలేదనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
రణ్‌బీర్ పర్‌ఫామెన్స్, 
హీరో, హీరోయిన్ల మధ్య హృద్యమైన లవ్ ట్రాక్


మైనస్ పాయింట్స్:
చాలా ఎక్కువే.బిట్టు బిట్టుగా చెప్పలేనంత

చివరిగా: 
‘బ్రహ్మాస్త్ర’ బాలీవుడ్ నెత్తిన మరో గుదిబండను మోపేసింది.ఆశించిన అంచనాల్ని అస్సలు అందుకోలేకపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com