గల్ఫ్ వాపసీలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు సన్నద్ధత కలిగి ఉండాలి
- September 14, 2022
దోహా: వలసలపై ఖతార్ లో జరుగుతున్న ఆసియా-గల్ఫ్ దేశాల చర్చా సమావేశంలో మంగళవారం ప్రవాసి కార్మికుల వేతనాల రక్షణ అనే అంశంపై చర్చ జరిగింది. వేతనాలు చెల్లించకపోవడం, ఎగవేయడం అనే సమస్యను అధిగమించడానికి ఆసియా-గల్ఫ్ వలసల నడవా (మైగ్రేషన్ కారిడార్) లోని ఉత్తమ ఆచరణలు (గుడ్ ప్రాక్టీసెస్), అభ్యసనాలు ఎలా ఉన్నాయో పరిశీలనకు తీసుకున్నారు. వేతన సమస్యల పరిష్కారానికి ఏ విధమైన విధానాలు, వ్యవస్థలను రూపొందిస్తే బాగుంటుంది అనే దిశగా ఈ చర్చా సమావేశం (సెషన్) కొనసాగింది. ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్ లో జరుగుతున్న రక్షిత, సక్రమ, క్రమబద్ద వలసల కొరకు ప్రపంచ సంఘటిత ఒప్పందం (గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్, ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్ - జిసిఎం) అమలు సమావేశంలో భాగంగా ఈ చర్చా గోష్టి జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాయి. ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది.
క్షేత్ర స్థాయిలో గల్ఫ్ కార్మికుల సమస్యలు తెలిసిన వారు చర్చలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వగా... తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఈ చర్చలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏదైనా ఏర్పాటు చేసిందా? విదేశాల నుంచి అనుకోకుండా వాపస్ వచ్చిన వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నలు వేసిన స్వదేశ్ అర్థవంతమైన చర్చకు తెరలేపారు. వేతనాలు, ఉద్యోగ అనంతర ప్రయోజనాలు నష్టపోయిన కార్మికులను ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఒక సంక్షోభ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కార్మికులను పంపే మూలస్థాన దేశాలు, కార్మికులను స్వీకరించే గమ్యస్థాన దేశాలు ఈ నిధి కోసం విరాళాలు సమకూర్చాలి. విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికులను రక్షించడానికి మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ పరికిపండ్ల కోరారు.
ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్ లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. రే జురీడిని ల పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు.
వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం ఎలా ఉంది? ఉద్భవిస్తున్న పరిస్థితిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు, ఉత్తమ ఆచరణలు తీసుకోబడ్డాయి? ఏవైనా అంతరాలు ఉన్నాయా, వాటిని ఎలా పరిష్కరించవచ్చు? ఆచరణాత్మక స్థాయిలో వేతన దొంగతనం గురించి ప్రతిస్పందించడంలో మొత్తం-సమాజం (వోల్ ఆఫ్ సొసైటీ), మొత్తం-ప్రభుత్వ (వోల్ అఫ్ గవర్నమెంట్) విధానం ఎలా పనిచేస్తున్నది? అనే ప్రశ్నలను ఆధారం చేసుకొని ప్యానల్ లోని వక్తలు ప్రసంగించారు. కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా కోసం రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు.
ఈ సందర్బంగా స్వదేశ్ పరికిపండ్ల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... 32 సంవత్సరాల క్రితం 1990-91 లో ఇరాక్ - కువైట్ మధ్య గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ అయిన 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు.
ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులు బలవంతంగా ఆయా దేశాల నుండి నెట్టివేయబడి వారి వారి స్వదేశాలకు కట్టుబట్టలతో పంపబడుతున్నారని స్వదేశ్ వివరించారు. వివిధ కారణాలతో వలస కార్మికులను గల్ఫ్ దేశాల నుండి వారి స్వదేశాలకు వాపస్ పంపడం కొత్త ఏమీ కాదు... గత 30-35 ఏళ్లుగా జరుగుతున్నదే అని అన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు సన్నద్ధత కలిగి ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025