కమనీయం శ్రీ సీతారాముల కళ్యాణం కడు సుందరం శ్రీ రామ పట్టాభిషేకం

- April 17, 2016 , by Maagulf

దుబాయ్ లోని తెలుగు లలితకళాసమితి భగవత్ సేవక బృందం ఆధ్వర్యం లో ఆకాశమంత పందిరి వేసి , పవిత్ర గోమయం తో అలికిన కళ్యాణ వేదికలో  15 ఏప్రియల్ 2016,విశేషం గా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగద్గురువుల ఆశీస్సుల తో ,వేద పండితుల స్వీయ నేతృత్వం లో భారత దేశానికి ఆవల దుబాయ్ మహా నగరం లో  శ్రీ సీతారాముల కళ్యాణం  మరియు  శ్రీ రామ పట్టాభిషేకం అత్యంత వైభవోపేతం గా జరిగింది. సుప్రభాత పూర్వమే శుభసూచకముగా ఆకాశ  గంగ భాగీరధి దశరధుని ఇంటి ఆడపడుచు  గా మరి  పరమశివుని జటాజూటం నుండి జాలువారి చిరు జల్లులు గా  ఇక్ష్వాకు వంశ తిలకునకు కళ్యాణ మహోత్సవ వేళ మంగళ స్నానాలు చేయించింది. విజ్ఞులైన వేద పండితులు  అయోధ్యా రాముని కి , వారి పరి పరివారానికి ప్రభాత సేవాంజలి గావించి, ఆపైన వేదోక్తం గా అభిషేకం నిర్వహించారు. కార్యక్రమం లో అత్యంత విశిష్టమైన సుందరకాండ ను పారాయణ చేస్తూ అందులోని విశేషాలను భక్తులకు చక్కగా వివరించారు శ్రీ ధూళిపాళ వారు. అలాగే అత్యంత పవిత్రమైన సుదర్శన హోమాన్ని ఋత్విజులు బహు చక్కగా నిర్వహించడం జరిగింది. ఇక కళ్యాణ వేళ శ్రీ రామ చంద్ర ప్రభువుని కి దీక్షా కంకణం,పవిత్ర యజ్ఞోపవిత ధారణ చేసి ఆ పైన వదూవరులకు పవిత్ర మంగళ వాద్యాల నడుమ  జీలకర్ర బెల్లం శిరమున పెట్టి   భద్రాచల సంప్రదాయాన్నిఅనుసరించి  తదనంతరం మూడు పుస్తెలను శ్రీ రామ చంద్రప్రభువు  చే  జానకీ మాతకు మాంగల్య ధారణ కావించారు. వేద సంప్రదాయాన్ని అనుసరించి ఏర్పరిచిన వలిచిన భియ్యం   తో పాటు , ముత్యాల ను  కలిపి   శ్రీ సీతారాములకు తలంబ్రాలను పోయడం జరిగింది, తదనంతరం దివ్యాక్షతలను భక్తులకు అందించారు.

సంప్రదాయ సిద్దాంతం గా అరటి ఆకులలో భక్తులకు వివాహ భోజనం వడ్డించడం జరిగింది ఇస్కాన్ సంస్థ వారు వారి భక్త బృందం తో రామ నామ సంకీర్తన చేస్తే, దత్త పీఠ భక్త బృందం  హనుమాన్ చాలీసా పారాయణ గావించారు.
ఇక సాయం సంధ్య వేళలో లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ సీతారాములకు ఊంజల్ సేవ గావించి, ఆ పైన పల్లకీ సేవ  వైభవోపేతం గా నిర్వహించారు, కృష్ణ, గోదావరి,పెన్నా, తుంగభద్రా, గంగా, కావేరి, నర్మదా నదుల నుండి తీసుకు వచ్చిన పవిత్ర నదీ జలాలతో, మరియు నాలుగు సముద్రాల  జలాలతో అభిషిక్తులని చేసి మకుట ధారణ తో లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ సీతారాములకు పట్టాభిషేకం నిర్వహించారు. ఆపైన ఏకాంత సేవ నిర్వహించి, వేద ఆశీర్వచనం తో కార్యక్రమాన్ని ముగించారు.

కార్యక్రమం ఆసాంతం దివ్య  ప్రవచనం తో పాటు , దుబాయ్ లోని సంగీత కళాకారులు శ్రీనివాస మూర్తి, సౌమ్య, రాకేశ్, వెంకటేష్, ప్రత్యూష , బాల, రాగమయూరి,నాగ లక్ష్మి గార్లతో పాటు సేవక బృందం లోని మహిళా సభ్యులు  చక్కని కీర్తనలు ఆలపింఛి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు, అలాగే తన నృత్యం తో చిరంజీవి శ్రావణి రామాయణ సుధను చక్కగా ఆవిష్కరించి ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమం  లో సుమారు 2000 మంది పై చిలుకు భక్తులు పాల్గొన్నారని అంచనా. ఈ సందర్బం గా వేద పండితులు  యావత్తు కార్యక్రమాన్ని చక్కని సమన్వయం తో నడిపించి నందుకు గాను  శ్రీమాన్ సాయికృష్ణ , శంకర్,వేంకటేశ్వరరావు, జితేంద్ర, కిశోర్ , సంతోష్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్,కిరణ్, అనిల్,నాగేశ్వర రావు, సుబ్రహ్మణ్య శర్మ, నరసింహ మూర్తి,రవికుమార్, బలరామ్,సునీల్, సంతోష్ ఎక్కిరాల, నరసింహారావు, రమేష్, పేర్రాజు ,బాలమోహన్దం పతుల తో పాటు గణేష్, పవన్, రాజశేఖర్, రవి,వర్మ,ప్రదీప్,సాయికుమార్,శ్రీరాం మరియు ఇతరులతో కూడిన  సేవక బృందం లోని ప్రతీ ఒక్కరికి స్వామి వారి ఆశీస్సులను అందజేశారు. అలాగే కార్యక్రమ నిర్వాహక బృందం వ్యక్తిగతం గా తమకు సహకరించిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు ఆవిష్కరించి లోక కల్యాణం కోసం జరిపే ఇలాంటి  కార్యక్రమాలకు సదా ఆ భగవంతుడు అండగా వుండాలని ప్రార్ధించింది.

ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన 'లలిత కళా సమితి' వారికి 'మాగల్ఫ్.కామ్' టీం తరపున కృతజ్ఞతలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com