భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా

- September 29, 2022 , by Maagulf
భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా

అమెరికా: అమెరికాలో నివసించే భారతీయులకు బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమెరికాలో ఏడేళ్లకు పైగా జీవిస్తున్నారా? హెచ్‌-1 బీ వీసా పై ఐటీ సంస్థ‌లో ప‌ని చేస్తున్నారా? అయితే గ్రీన్ కార్డ్‌.. అమెరికా సిటిజ‌న్‌షిప్ పొందవచ్చు.ఇందు కోసం ఇమ్మిగ్రేష‌న్ యాక్ట్ లో స‌వ‌ర‌ణలు చేర్చారు. కొన్ని క్యాట‌గిరీల్లో ప‌ని చేస్తున్న భార‌తీయ టెక్ నిపుణుల‌కు ల‌బ్ధి చేకూర్చేలా నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ రూపొందించిన బిల్లును అమెరికా సెనెట్‌లో ప్రవేశ పెట్టారు.

దీని ప్ర‌కారం అమెరికాలో వ‌రుస‌గా ఏడేళ్లు ప‌ని చేస్తే గ్రీన్ కార్డు పొందడానికి అర్హ‌త సాధించిన‌ట్లే. ఈ బిల్లును సెనెట‌ర్ అలెక్స్ పాడిల్లా ప్ర‌తిపాదించ‌గా.. ఇత‌ర సెనెట‌ర్లు ఎలిజ‌బెత్ వారెన్‌, బెన్‌రాయ్ లుజాన్‌, డిక్ దుర్బిన్ మ‌ద్ద‌తు ప‌లికారు. అమెరికా ప్ర‌జా ప్ర‌తినిధుల స‌భ‌లోనూ కాంగ్రెస్ ఉమ‌న్ జో లాఫ్‌గ్రెన్‌ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. జో లాఫ్‌గ్రెన్ ఇమ్మిగ్రేష‌న్ హౌస్ స‌బ్ క‌మిటీ చైర్‌గా ఉన్నారు. ఈ బిల్లు చ‌ట్టంగా మారితే ప్ర‌స్తుతం హెచ్‌-1బీ వీసాపై ప‌ని చేస్తున్న వారితో స‌హా 80 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చేకూరుతుంది.

ఇందులో హెచ్‌-1బీ వీసా దారులు, దీర్ఘ‌కాలం వీసాపై ప‌ని చేస్తున్న నిపుణుల పిల్లలు, గ్రీన్ కార్డు డ్రీమ‌ర్లు, త‌దిత‌రుల‌కు గ్రీన్ కార్డు ల‌భిస్తుంది. అంటే అమెరికా పౌర‌స‌త్వం ల‌భిస్తుంది. దేశాల వారీగా కోటా ప్ర‌కారం అమెరికా జారీ చేస్తున్న గ్రీన్ కార్డు కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న భార‌తీయ నిపుణులు అత్య‌ధికంగా ల‌బ్ధి పొందుతార‌ని భావిస్తున్నారు.

ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును సెనెట‌ర్ అలెక్స్ పాడిల్లా ప్ర‌తిపాదిస్తూ.. `అమెరికా ఎకాన‌మీకి వెన్నెముక‌గా ఉంటూ ఏళ్ల త‌ర‌బ‌డి గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న వారి ఆశ‌లు సాకారం చేసేలా మ‌న అప్‌డేటెడ్ ఇమ్మిగ్రేష‌న్ సిస్ట‌మ్ చ‌ర్య‌లు తీసుకుంటుంది. నేను ప్ర‌తిపాదించిన బిల్లుతో 35 ఏళ్లకు పైగా అమెరికాలో నివాసం ఉంటూ శాశ్వ‌త నివాసం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారందరికీ తొలిసారి ఇమిగ్రేష‌న్ రిజిస్ట్రీ.. క‌టాఫ్ డేట్ అప్‌డేట్ చేస్తుంది.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి అమెరికా అభివృద్ధిలో భాగ‌స్వాములైన వారి, జీవిస్తున్న వారి, ప‌ని చేస్తున్న ల‌క్ష‌ల మంది ఇమ్మిగ్రెంట్ల‌పై ఈ బిల్లు ప్ర‌భావం చూపుతుంది` అని అన్నారు. యూఎస్ ఇమ్మిగ్రేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లు చ‌ట్టంగా మార‌డానికి కొంత స‌మ‌యం ఉంది.తొలుత యూఎస్ సెనెట్‌, ప్ర‌జాప్ర‌తినిధుల స‌భ అంగీక‌రించి, ఆమోదించాలి.అటు పై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆ బిల్లుపై సంత‌కం చేయ‌డంతో చ‌ట్టంగా మారుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com