విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తదాన శిబిరం....

- September 30, 2022 , by Maagulf
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తదాన శిబిరం....

విజయవాడ: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విజయవాడ సిబ్బంది సమాజం పట్ల తమ బాధ్యతలో భాగంగా ఈరోజు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరాన్ని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి ప్రారంభించారు.  ఇతర సభ్యులను ఉత్సాహపరిచేందుకు ఆయన స్వయంగా రక్తదానం చేశారు. తమ సిబ్బందిని ప్రేరేపించడమే కాకుండా తన భార్యను కూడా రక్తదానం చేయడానికి ప్రేరేపించడం గొప్ప మానవతా విశేషంగా చెప్పవచ్చు. ఈ రక్తదాన శిబిరంలో గ్రౌండ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ముందుకు వచ్చి ఈ రక్తదాన సేవా కార్యక్రమంలో పాల్గొని 45 యూనిట్ల రక్తాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ అండ్ ప్రాజెక్ట్స్ రాష్ట్ర కోఆర్డినేటర్ బి.వి.ఎస్. కుమార్ రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ సెంటర్ లలో రక్త భాగాలను వేరు చేయడానికి మరియు సరఫరా చేయడానికి అత్యాధునిక పరికరాలు ఉన్నాయని, రక్తదాత యొక్క ప్రతి రక్తదానం అత్యవసర పరిస్థితిలో ఉన్న ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని, రక్తదాత ముగ్గురు రోగులకు ప్రాణదానం చేసిన వారవుతారని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి, ప్రజలను రక్షించేందుకు ముందుకు వచ్చిన ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి బి.వి.ఎస్ కుమార్ మెమెంటోను అందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీ రత్నం మాట్లాడుతూ, తమ భద్రతా సిబ్బంది పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన రక్తదానం చేస్తారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com