ETCA, తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...

- October 03, 2022 , by Maagulf
ETCA, తెలుగు అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...

యూఏఈ: తేదీ 02 అక్టోబర్ 2022 ఆదివారం రోజున అజ్మాన్ లోని ఇండియన్ అసోసియేషన్ ఆడిటోరియంలో సుమారు 5000 మంది భారీ జన సందోహం నడుమ ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం( ETCA), తెలుగు అసోసియేషన్ , తెలంగాణ జాగృతి యూఏఈ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సాయంత్రం 3.00 గంటల నుండి రాత్రి 10.30 గంటల వరకు గ్రామీణ జీవన సంస్కృతిని ప్రతిబింబించే మాదిరిగా 'బతుకమ్మ సంబరాలు' ఎంతో అట్టహాసంగా జరిగాయి.

ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ తెలంగాణ జానపద గాయని తేలు విజయ ,ఇండియన్ కౌన్సిలేట్ నుంచి లేబర్ వైస్ కాన్సుల్ ఆనంద్ కుమార్ పిసిపాటి మరియు పలు తెలుగు రాష్ట్రాల నుండి  ప్రముఖులు పాల్గొన్నారు.

ముందుగా కళాకారులు డప్పు వాయుద్యాలతో బతుకమ్మలను ఎదుర్కొన్నాక మహిళలు అందరు కలిసి గౌరీ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది.తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో అందమైన బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరు కావడం మరియు బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి పాడటంతో వేదిక అంతా గొప్ప పండగ వాతావరణంతో  నిండి పోయింది.  

అనంతరం కార్యక్రమనికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ, భారీ ఎత్తున నిర్వహించబడిన సంబరాలు చూసి 12 సంవత్సరాలుగా క్రమం తప్పకుండ బతుకమ్మను నిర్వహిస్తున్న ETCA వారి కృషిని కొనియాడారు.తెలుగు అసోసియేషన్ స్థాపించిన మొదటి సంవత్సరం లోనే ETCA , జాగృతి యూఏఈ విభాగం తో కలిసి బతుకమ్మ పండుగను నిర్వహించడం చాల సంతోషాన్ని కలిగించిందని, ఇలాంటి సాంస్కృతిక పరమైన వేడుకలు భావితరాలకు మన ఆచార సంప్రదాయాలను తెలియచేయడానికి దోహదపడుతాయని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.గాయిని తేలు విజయ పాడిన బతుకమ్మ పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసాయి.చిన్నపిల్లలు సైతం సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చప్పట్లతో హుషురూగా ఆడిపాడటం అందరిని ఆకట్టుకొన్నాయి.

ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలందరు కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు.తెలంగాణ తలమానికమైన బతుకమ్మ సంబరాలను గొప్పగా జరుపుకోవడం చూసి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మహిళలు తీసుకొచ్చిన రంగు రంగు పూల బతుకమ్మలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి.నిర్వాహకులు అందమైన బతుకమ్మలను ఎంపిక చేసి, బతుకమ్మ పాటల పోటీలు, సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ETCA మహిళా సభ్యులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ కోలాటాలు, జానపద నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వెళ్లి రావమ్మ బతుకమ్మ అంటూ గౌరమ్మను తలుస్తూ బతుకమ్మలను ఏర్పాటు చేసిన కొలనులో నిమ్మర్జనం చేశారు,కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి బతుకమ్మ ప్రసాదంను నిర్వాహకులు  అందజేయడం జరిగింది.

ఈ వేడుకకు ట్రైకలర్స్ ప్రాపర్టీస్ ప్రధాన స్పాన్సర్ కాగా,ఎల్.ఎస్..పి.ఎమ్.కె గ్రూప్ అఫ్  కంపెనీస్, BSR సెక్యూరిటీస్,సేఫ్ యార్డ్స్ ఇన్ కో స్పాన్సర్ కాగా వ్యవహరించారు , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్ అందరికి నిర్వాహకులు బతుకమ్మ జ్ఞాపికను అందచేశారు.

ఈ సంబరాల్లో ETCA  అధ్యక్షులు సత్యం రాధారపు, ETCA వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర, మహిళ విభాగ ఇంఛార్జ్ అల్లూరి సరోజ, తెలుగు అసోసియేషన్ చైర్మన్ దినేశ్ కుమార్ ఉగ్గిన, జనరల్ సెక్రెటరి వివేక్, కల్చరల్ డైరెక్టర్ సురేశ్, తెలంగాణ జాగృతి యూఏఈ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు పీచర, ఉపాధ్యక్ష్యులు అరె శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాణి కోట్ల, కటకం సాయిచందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com