దగ్గు సిరప్‌ల విక్రయంపై క్లారిటీ ఇచ్చిన బహ్రెయిన్

- October 08, 2022 , by Maagulf
దగ్గు సిరప్‌ల విక్రయంపై క్లారిటీ ఇచ్చిన బహ్రెయిన్

బహ్రెయిన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిషేధించిన కలుషిత దగ్గు, జలుబు సిరప్‌లు ఏవీ బహ్రెయిన్‌లో చెలామణిలో లేవని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ(NHRA) ప్రకటించింది. స్థానికంగా లభించే ఈ కేటగిరీ మందులు నిషేధిత తయారీదారు లేదా సరఫరాదారు నుండి వచ్చినవి కాదని NHRA  స్పష్టం చేసింది. ఇటీవల గాంబియాలో దగ్గు సిరప్ లు తాగిన డజన్ల కొద్దీ చిన్నపిల్లల.. తీవ్రమైన కిడ్నీ గాయాలతో మరణించిన విషయం తెలిసిందే. దీనికి కలుషితమైన  లేదా జలుబు సిరప్‌లు కారణమై ఉండొచ్చని WHO తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌పై UN ఏజెన్సీ దర్యాప్తు చేస్తోందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. మైడెన్ ఫార్మా వస్తువులను మార్కెట్ నుండి తొలగించాలని రెగ్యులేటర్‌లను కోరుతూ WHO మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీ చేసింది. ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ దగ్గు సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ లను మార్కెట్ల నుంచి ఉపసంహరించాలని అన్ని దేశాలకు సూచించింది. తమ ల్యాబ్ విశ్లేషణలో డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అధిక మోతాదును నిషేధిత సిరప్ లలో గుర్తించినట్లు పేర్కొంది. ఇది విషపూరితమైనదని, తీవ్రమైన మూత్రపిండాల గాయానికి దారి తీస్తుందని WHO హెచ్చరించింది. మైడెన్ ఫార్మాస్యూటికల్స్  ఈ తరహా ఔషధాలను తయారు చేస్తుందని.. వాటిని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తుందని తెలిపింది. మరోవైపు న్యూఢిల్లీకి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసే దగ్గు సిరప్‌ల నమూనాలను పరీక్షిస్తున్నట్లు భారత్ తెలిపింది. అందులో ఏదైనా తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని భారత్‌ హామీ ఇచ్చింది.

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com