సౌదీలో లోకలైజేషన్ సంస్కరణలు వేగవంతం

- October 17, 2022 , by Maagulf
సౌదీలో లోకలైజేషన్ సంస్కరణలు వేగవంతం

రియాద్: ఆహార రంగం, డ్రగ్ సెక్టర్లలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు 2022 చివరికల్లా కొత్తగా 11 విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నట్లు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రి అహ్మద్ అల్-రాజీ వెల్లడించారు. దీని కారణంగా ప్రైవేట్ రంగంలో సౌదీ కార్మికుల సంఖ్యను 2.12 మిలియన్లకుపైగా పెంచడానికి ఈ నిర్ణయాలు దోహదపడతాయని అల్-రాజీ పేర్కొన్నారు. అలాగే సౌదీ పౌరుల నిరుద్యోగిత రేటును 9.7 శాతానికి తగ్గించడంలోనూ..  మహిళల ఆర్థిక భాగస్వామ్య రేటును 35.6 శాతానికి పెంచుతాయన్నారు. కార్మిక వ్యవస్థ, దాని నిబంధనలతో ప్రైవేట్ రంగ సంస్థల కంప్లియాన్సి రేటు ఈ సంవత్సరంలో 98 శాతానికి చేరుకుందని అల్రాజీ తెలిపారు. అక్టోబర్ నెల ప్రారంభంలో మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2023 ఏప్రిల్ 6  నుండి 35 శాతం కన్సల్టెన్సీ వృత్తులు, వ్యాపారాలను స్థానికీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక సలహా నిపుణులు, వ్యాపార సలహాదారులు, సైబర్ సెక్యూరిటీ అడ్వైజరీ నిపుణులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మేనేజర్లు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నిపుణుల కొరత తీరుతుందన్నారు. కన్సల్టింగ్ సేవల నిబంధనలను సవరించారని, స్థానికీకరణ శాతాన్ని నిర్ధారించడానికి కన్సల్టింగ్ కంపెనీలను నియంత్రిస్తూ కొన్ని నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుందని ఆర్థిక మంత్రి ముహమ్మద్ అల్-జదాన్ గుర్తు చేశారు.  గత నెలలో (సెప్టెంబరు) మంత్రిత్వ శాఖ తన లోకలైజేషన్ కార్యక్రమాన్ని అమ్యూజ్‌మెంట్ పార్కులు, వినోద కేంద్రాలలో అమలు చేయడం ప్రారంభించిందని తెలిపింది. ఆ రంగాల్లోని 70 శాతం ఉద్యోగాలను స్థానికీకరించాలనే లక్ష్యంలో ఇది ఒక భాగమన్నారు. అలాగే మూసివేసిన వాణిజ్య సముదాయాలలో వినోద కేంద్రాలను 100 శాతం స్థానికీకరించాలని ప్రయత్నిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ విజన్ 2030 లక్ష్యాలను సాధించడంలో ప్రధాన మద్దతుదారుగా, భాగస్వామిగా ప్రైవేట్ రంగం పాత్ర గురించి రియాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్, అజ్లాన్ అల్-అజ్లాన్  గతంలో అనేక సందర్భాల్లో వివరించారు. మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో, నిరుద్యోగాన్ని తగ్గించేందుకు స్థానికీకరణ కార్యక్రమాలకు ప్రైవేట్ రంగం సహకరించిందని ఆయన వివరించారు. రియాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో సౌదీ మంత్రి,  వ్యాపారవేత్తల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్లు గుర్తుచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com