సైబరాబాద్ లో ‘ఆపరేషన్ రోప్’ పై ట్రాఫిక్ సమీక్షా సమావేశం

- October 18, 2022 , by Maagulf
సైబరాబాద్ లో ‘ఆపరేషన్ రోప్’ పై ట్రాఫిక్ సమీక్షా సమావేశం

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఈరోజు ఆపరేషన్ రోప్/  (Removal of Obstructive Parking & Encroachments) పై సైబరాబాద్ పోలీసులకు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వచ్చిన హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగేలా చూడడమే ఆపరేషన్ రోప్ ముఖ్య ఉద్దేశమన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో గణనీయమైన మార్పు తీసుకు వచ్చినప్పుడే ప్రజలకు ఉపయోగమన్నారు. 

ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ ట్రాఫిక్ నియంత్రణ & నిర్వహణ ప్రాథమిక సూత్రాలను సిబ్బందికి వివరించారు. పోలీసుల్లో ట్రాఫిక్ పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయన్నారు. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది వంద శాతం ప్రజల మధ్యలో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.అలాగే GHMC, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో బయట ఉన్నప్పుడే సమస్యలు తెలుస్తాయి, ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమన్నారు. 

ముందుగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు గాను రోడ్ల పై ఎలా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేయాలన్నారు. 

2020 మార్చిలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా పౌరులు తమ సొంత వాహనాలను ఉపయోగించడంతో కోవిడ్ అనంతరం రోడ్లపై కొత్తగా 18 శాతం కొత్తగా వాహనాలు రోడ్లపై కి వచ్చాయన్నారు.పెరిగిన వాహనాల రద్దీ దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆపరేషన్ రోప్ అవసరం ఉందన్నారు. 

ఆపరేషన్ రోప్ లో భాగంగా ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ తయారు చేశామన్నారు. ఇందులో Enforcement, Education & Engineering of traffic management ప్రధానమన్నారు.ట్రాఫిక్ సజావుగా ఉండాలంటే encroachments/ ఆక్రమణల తొలగింపు, illicit obstructive parking పై దృష్టి సారించాలన్నారు. GO. 166 ప్రకారం కమర్షియల్ బిల్డింగ్ లలో 40 శాతం పార్కింగ్ ఉండేలా చూడాలన్నారు. 

తాను హైదరాబాద్ లో అడిషనల్ సీపీ ట్రాఫిక్ గా ఉన్న సమయంలో ట్రాఫిక్ కు సంబంధించి అనేక కొత్త సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. సిబ్బంది సౌకర్యార్థం సమ్మర్ లో కిట్స్, కాలుష్యం నుంచి రక్షణకు గాగుల్స్, 30 శాతం ట్రాఫిక్ అలవెన్స్ కోసం ఎస్టిమేట్ కమిటీ తో సంప్రదింపులు, ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కోసం కృషి చేశానన్నారు. తాను గతంలో పని చేసిన ట్రాఫిక్ అనుభవాలను సిబ్బందితో పంచుకున్నారు. 

అనంతరం సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సజావుగా ఉండేలా ‘ఆపరేషన్ రోప్’ను ప్రారంభిస్తున్నామన్నారు. నగర రోడ్లపై పౌరులు సాఫీగా ప్రయాణం సాగించేందుకు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ “ఆపరేషన్ రోప్” ప్రారంభిస్తున్నట్లు సీపీ తెలియజేశారు. ఇక నుంచి ఈ ఆపరేషన్‌ లో భాగంగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద వాహనదారులు స్టాప్‌ లైన్‌ ముందు ఆగడం, ఫ్రీ లెఫ్ట్‌లను వదిలేయడం, రోడ్లపై క్యారేజ్‌ వేలను సాఫీగా ఉంచడంలో వాహనదారులలో అవగాహన పెరుగుతుందన్నారు. ఒక వైపు అవగాహన కల్పిస్తునే, మరోవైపు క్రమ శిక్షణ తప్పే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

తమ సిబ్బందికి అవగాహన కల్పించినందుకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర డిసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ రావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏడీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, బాలానగర్ ట్రాఫిక్ ఏసిపి చంద్రశేఖర్ రెడ్డి, శంషాబాద్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ నాయుడు, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com