‘కాంతార’ మూవీ రివ్యూ

- October 20, 2022 , by Maagulf
‘కాంతార’ మూవీ రివ్యూ

నటీనటులు: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తదితరులు.

సంగీతం: అజనీష్ లోక్‌నాధ్,
సినిమాటోగ్రఫీ: అరవింద్ కశ్యప్,
కథ, దర్శకత్వం: రిషబ్ శెట్టి, 
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్.

‘కేజీఎఫ్’ సినిమాతో కన్నడ చిత్ర సీమ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఆయా భాషల ప్రేక్షకులు. ఒకప్పుడు చాలా చిన్న సినిమాగా భావించే కన్నడ సినిమా, ‘కేజీఎఫ్’ పుణ్యమా అని ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదిగింది. అలా అంచనాలు పెంచేసుకున్న కన్నడ సీమ నుంచి తాజాగా వచ్చిన సినిమానే ‘కాంతార’. ఈ సినిమా కూడా భారీ అంచనాలు నమోదు చేసింది. మరి, రిలీజ్ తర్వాత ఆ అంచనాల్ని ‘కాంతార’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
అనగనగా ఒక రాజు. బోలెడంత సంపద, మంచి సంతానం.. సుభిక్షమైన రాజ్యం.. ఇలా అన్నీ వున్నా ఎందుకో ఆ రాజుకు మనశ్శాంతి కరువవుతుంది. ఆ మనశ్శాంతిని వెతుక్కుంటూ కొండలనకా, గుట్టలనకా, అడవుల వెంట పడి తిరుగుతాడు. చివరికి ఓ అడవిలో ఓ దైవ శిల తారసపడుతుంది. ఆ శిలను చూడగానే రాజులో ఎక్కడ లేని సంతోషం కనిపిస్తుంది. మనసులోని చింతలన్నీ తీరిపోయి ప్రశాంతత దక్కినట్లుగా అనిపిస్తుంది. దాంతో, అక్కడి ప్రజలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ దైవ శిలను తన వెంట తీసుకెళతాడు రాజు. అందుకు ప్రతిగా ఆ అడవిని అక్కడి జనానికి దానం చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ అడవి జోలికి ఎవ్వరూ రాకూడదని షరతు తీసుకుంటారు ఆ అడవి ప్రజలు. కాలక్రమంలో రాజ వంశీకులు ఆ అడవిని దక్కించుకోవడానికి కుట్రలు పన్నుతారు. మరోవైపు ఆ అడవి ప్రభుత్వ సొత్తు అని.. సర్వే చేసి, ఎలాగైనా ప్రభుత్వానికి అప్పగించేయాలని చూస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్ మురళి (కిషోర్). అతని ప్రయత్నాలకు అడ్డు పడతాడు ఆ అడవికి చెందిన శివ (రిషబ్ శెట్టి). దైవమే తమకు తోడుగా వుందని నమ్మిన ఆ అడవి ప్రజలు తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఏం చేశారు.? ఈ క్రమంలో శివ ప్రయాణం ఎలా జరిగింది.? అడవిని దక్కించుకునే ప్రయత్నంలో పలు క్రూరమైన కుట్రలకు పాల్పడిన రాజవంశీకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయ్ అనేది తెలియాలంటే ‘కాంతార’ చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే.!

ఓ పక్క దర్శకుడిగా, మరోపక్క నటుడిగా కథను డీల్ చేయడం అంత ఆషా మాషీ కాదు. ఆ సవాల్‌ని జయించడంలో రిషబ్ శెట్టి హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు. తన నటనలో విశ్వరూపం కనబరిచాడు. డైరెక్టర్‌గా ది బెస్ట్ టేకింగ్ ఇచ్చాడు. అందుకే ఈ సినిమాకి తెలుగు ప్రజలు సైతం పట్టం కట్టారు. కన్నడ సినిమా అయినా ఈ సినిమాలోని ఎమోషన్లు, దైవత్వానికి సంబంధించిన సెంటిమెంట్లు.. విలేజ్ నేటివిటీ.. మట్టి పరిమళాలు.. ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాయ్. కథలో గ్రిప్పింగ్ ప్రేక్షకున్ని కూర్చున్న చోట నుంచి కదలనీయకుండా చేస్తుంది. 
ఇక, హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కాస్త బోర్ అనిపించినా కథలో లీనమై పోవడంతో అదేమంత పెద్ద మైనస్ అనిపించదు. అలాగే, మిగిలిన నటీనటుల పాత్రలూ, పాత్ర చిత్రీకరణ చక్కగా కుదిరింది సినిమాకి. జానపద నేపథ్యంలో సాగిన విలేజ్ యాక్షన్ డ్రామా అయినా, కమర్షియల్ యాంగిల్‌లో చక్కని హాస్యం కుదరడంతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ‘కాంతార’ అమితంగా ఆకట్టుకుంటుంది
యాక్షన్ ఘట్టాలు ఆధ్యంతం ఆసక్తిని కలిగిస్తాయ్. అక్కడక్కడా దైవానికి సంబంధించిన సెంటిమెంట్ సీన్లు మనసుకు హత్తుకుంటాయ్. ఇక, యాక్షన్ విషయానికి వస్తే, అద్భుతహ అనే మాట చిన్నదిగా తోస్తుంది. సినిమా అంతా ఓ ఎత్తు అయితే, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో గూస్ బంప్ సీన్స్.. ధియేటర్ నుంచి బయటికి వచ్చినాకా కూడా ప్రేక్షకున్ని వెంటాడేస్తాయంటే అతిశయోక్తి అనిపించదు.

సాంకేతిక వర్గం పని తీరు:

నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఎక్కడా రాజీ పడలేదు. యాక్షన్ ఎపిసోడ్స్‌కి తగ్గట్లుగా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకున్ని కట్టిపడేస్తుంది. సంగీతం కూడా కథలో భాగంగా ఆకట్టుకుటుంది. ఇక, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, ధియేటర్‌లో కాదు, సినిమా చూస్తున్నంత సేపూ వేరే ప్రపంచంలో వున్నట్టే అనిపిస్తుంది. ఓవరాల్‌గా ‘కాంతార’ టెక్నికల్ టీమ్ వర్క్ హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.

ప్టస్ పాయింట్స్:

రిషబ్ శెట్టి నట విశ్వరూపం,
యాక్షన్ ఘట్టాలు, 
క్లైమాక్స్ సన్నివేశాలు..  

మైనస్ పాయింట్స్:

హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్,
సెకండాఫ్‌లో స్లోగా సాగిన కొంత పార్ట్.. 

చివరిగా: 
ప్రతీ ప్రేక్షకుడు చూసి అబ్బురంగా ఫీలవ్వదగ్గ మరో అద్భుత ప్రపంచం.. ‘కాంతార’.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com