గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- September 29, 2025
విజయవాడ: ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 శాతం అకాల మరణాలకు గుండె సంబంధిత వ్యాధులే కారణం అవుతున్నాయని, ఇందులో చాలా వరకూ నివారించదగినవే అని ఎన్ఠీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రముఖ కార్డియాలజిస్ట్, డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపి చాప్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. సూర్యారావుపేటలోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశం అనంతరం అనంతరం ఎన్టీఆర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు ప్రజలకు గుండె ఆరోగ్య సంరక్షణపై పలు సూచనలు చేశారు. ఈ సంవత్సరం "డోంట్ మిస్ ఎ బీట్" అనే థీమ్ తో గుండె సంరక్షణకు చేపట్టాల్సిన అన్నీ చర్యల గురించి తాము అవగాహన కల్పించనున్నామని వారు చెప్పారు. గుండె వ్యాధులలో ప్రధానంగా ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (కరోనరీ ఆర్టరీ డిసీజ్), స్ట్రోక్, హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధించిన విషయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనదేశంలో సుమారు 11 శాతం మంది గుండె జబ్బుల బారిన పడి ఉన్నారని, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, అధిక బరువు వీటికి ప్రధాన కారణాలని సిఎస్ఐ ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ పి. రమణ రావు పేర్కొన్నారు. నాన్ మోడీఫయబుల్ రిస్క్ ఫాక్టర్లు (వయసు, ఆడ మగ భేదాలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉండడం లేదా జన్యు పరమైన కారణాలు) కాకుండా, మారుతున్న జీవన శైలి అంటే వ్యాయామం లోపించడం, సరైన ఆహారం తీసుకోక పోవడం, నిద్ర తక్కువగా ఉండడం, వత్తిడి పెరగడం, పొగత్రాగడం, మద్యం సేవించడం వంటి కారణాల వలన) నేడు అనేక మంది చిన్న వయసు వారిలోనూ గుండె జబ్బుల తీవ్రత పెరుగుతోందని, వీటిని గుర్తించి, సరైన చర్యలు పాటిస్తే గుండె సంబంధించిన సమస్యలు చాలా వరకూ తగ్గుతాయని, సిఎస్ఐ ఏపీ చాప్టర్ ట్రెజరర్ డాక్టర్ ఏ. పూర్ణానంద్ వివరించారు. ఒక వేళ గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య తలెత్తినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య శాస్త్ర అభివృద్ధి వలన ఏంటో మెరుగైన చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని ప్రజలు గుర్తించాలని సంస్థ సెక్రెటరీ డాక్టర్ కె. శ్రీనివాస రెడ్డి తెలిపారు. గుండె జబ్బుల సమస్యకు హై బిపి ప్రధాన కారణం అని, 40 సంవత్సరాల వయసు దాటిన ప్రతీ వారు కనీసం ఆరు నెలలకు ఒకసారి పరీక్ష చేయించుకొని, తమ ఆరోగ్య పరిస్థితిని గురించి కార్డియాలజిస్టులను సంప్రదించి తదనుగుణంగా నడుచుకోవాలని, ఈ విషయం లో స్వంత వైద్యం ప్రమాదకరమని, మందులు ఖచ్చితంగా వాడాలని, ఇంకొకరికి రాసిన మందులను వేసుకోకూడదని, తమంతట తామే బిపి కంట్రోల్లో ఉందని నిర్ణయించుకొని మందులు వేసుకోవడం ఆపేయడం లేదా డోసులను తగ్గించుకోవడం వంటివి చాలా ప్రమాదకరమని, రోజూ 10 వేల అడుగులు నడక సాధన గుండెకు మంచి చేస్తుందని, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తాము నిర్వహించే గుండె సంరక్షణా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని మరిన్ని వివరాలు తెలుకోవాలని సిఎస్ఐ ఏపీ చాప్టర్ కార్డియాలజిస్టులు తెలియజేశారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







