‘ఓరి దేవుడా' మూవీ రివ్యూ

- October 21, 2022 , by Maagulf
‘ఓరి దేవుడా\' మూవీ రివ్యూ

నటీనటులు: విశ్వక్‌సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, విక్టరీ వెంకటేష్ (గెస్ట్ రోల్), మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, నాగినీడు వెంకటేష్ కాకుమాను తదితరులు.
సంగీతం: లియోన్ జేమ్స్
మాటలు: తరుణ్ భాస్కర్
సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న
నిర్మాణం: పీవీపీ సినిమా
దర్శకుడు: అశ్వథ్ మారిముత్తు

విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. తమిళ హిట్ మూవీ ‘ఓ మై కడవులే’ సినిమాకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కి ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రమోషన్లు కూడా హై రేంజ్‌లో చేశారు. దాంతో అంచనాలు బాగా వున్నాయ్. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఇమేజ్ దక్కించుకున్న హీరో విశ్వక్ సేన్.. ఇలా పలు రీజన్స్ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యేలా చేశాయ్. మరి, ఆ అంచనాల్ని ‘ఓరి దేవుడా’ అందుకుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
చిన్నప్పట్నుంచీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మెలిగిన అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత అభిప్రాయాలు కలవకపోవడంతో, ఏడాది తిరక్కుండానే విడాకులకు అప్లై చేస్తారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర అర్జున్‌ని ఓ అపరిచిత వ్యక్తి కలుస్తాడు. కోర్టులో జరగబోయే విషయాల్నిముందుగానే అర్జున్‌కి వివరిస్తాడు. ఎవరా అపరిచిత వ్యక్తి.? లైఫ్‌లో జరిగే విషయాల్ని ముందుగానే ఎందుకు చెబుతాడు.? అసలు మీరా (ఆశాభట్) ఎవరు.? పెళ్లి విషయంలో సెకండ్ ఛాన్స్ కావాలని దేవుడు (వెంకటేష్)ని మొర పెట్టుకున్న విశ్వక్ సేన్‌కి దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడా.? ఆ తర్వాతి పరిణామాలెలా సాగాయి.? అనేది తెలియాలంటే ‘ఓరి దేవుడా’ చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
విశ్వక్ సేన్ మంచి నటుడు. నో డౌట్. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. భావోద్వేగాలు పంచడం దగ్గర నుంచీ, పతాక సన్నివేశాల వరకూ అంచెలంచెలుగా తన నటనలో పరిణీతి చూపించాడు. హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్ ఇద్దరికీ యాక్టింగ్ స్కోపున్న పాత్రలే. వాళ్ల పాత్రలకు వాళ్లు న్యాయం చేశారు. రాహుల్ రామకృష్ణ నవ్వించడంలో తన పని తాను చేసుకుపోయాడు. మురళీ శర్మ, నాగినీడు తమ సీనియారిటీకి న్యాయం చేశారు. ఇక గెస్ట్ రోల్ పోషించిన వెంకటేష్ దేవుడిగా తన టైమింగ్ అదరగొట్టేశాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
ఒరిజినల్ తెరకెక్కించిన అశ్వత్ మారి ముత్తునే ఈ సినిమాని తెరకెక్కించడంతో పెద్దగా లోపాలేమీ వుండవు. ఒరిజినల్‌కి ఎలాంటి డ్యామేజ్ రాకుండా చూసుకున్నాడు. ఎంచుకున్న పాత్రలు కథకు బాగా సూటవ్వడంతో కథనం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. అతి ఎక్కువ చేయకుండా సినిమాని డ్రమటిక్‌గా లాగించేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. తరుణ్ భాస్కర్ మాటలు బాగున్నాయ్. ఇంకాస్త హాస్యం పండి వుంటే బాగుండేదని ప్రేక్షకుల అభిప్రాయం. సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. నిర్మాణ విలువలు బాగున్నాయ్. మ్యూజిక్ ఓకే.
ప్రధమార్ధం అంతా హీరో, హీరోయిన్ల మధ్య స్నేహం, పెళ్లి, ఆ తర్వాత వచ్చే గిల్లి కజ్జాలు.. ఇలా సరదాగా సాగిపోతుంది. ద్వితీయార్ధంలో కాస్త సాగతీత ఎక్కువయినట్లుగా అనిపిస్తుంది. దేవుడి పాత్రలో వెంకటేష్ స్ర్కీన్ మీద కనిపించినంత సేపూ చాలా బాగుంటుంది. విశ్వక్ సేన్, వెంకటేస్ మధ్య సీన్లు స్ర్కీన్‌పై చాలా బాగుంటాయ్. పతాక సన్నివేశాల్లో హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు, సంభాషణలూ ఆకట్టుకుంటాయ్.

ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
హీరో, హీరోయిన్ల నటన, 

మైనస్ పాయింట్స్:
తగ్గిన హాస్యం.
సెకండాఫ్ సాగతీత

చివరిగా: ‘ఓరి దేవుడా’ ఓ సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. పండగ సీజన్‌కి ఓ బెస్ట్ టైమ్ పాస్ మూవీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com