ఏపీలో రూ.270 కోట్లతో ఇథనాల్ ప్లాంట్..

- November 04, 2022 , by Maagulf
ఏపీలో రూ.270 కోట్లతో ఇథనాల్ ప్లాంట్..

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని గుమ్మళ్లదొడ్డి వద్ద నిర్మిస్తున్న బయో ఇథనాల్ ప్లాంట్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ ను అసాగో ఇండస్ట్రీస్ కంపెనీ రూ.270 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. బ్రోకెన్ రైస్ (నూకలు)తో ఈ ప్లాంట్ లో బయో ఇథనాల్ తయారు చేస్తారు.

ఈ బయో ఇథనాల్ ప్లాంట్ కు భూమి పూజ చేసిన అనంతరం సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని జగన్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్గదర్శకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, ఒక పరిశ్రమకు అవసరమైన అన్ని అనుమతులు కేవలం 6 నెలల్లోనే ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం జగన్ తెలిపారు.

ఈ బయో ఇథనాల్ కంపెనీ టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ కుమారుడు ఆశిష్ గుర్నానీకి చెందిన పరిశ్రమ అని సీఎం జగన్ వెల్లడించారు. ఆర్నెల్ల కిందట తాను దావోస్ వెళ్లిన సమయంలో, సీపీ గుర్నానీతో భేటీ అయ్యానని, ఆయన తన కుమారుడు బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న విషయం చెప్పారని వివరించారు. ఈ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పగా, వారిని వెంటనే రాష్ట్రానికి ఆహ్వానించామని తెలిపారు. ఆపై అన్ని రకాల అనుమతులతో కేవలం 6 నెలల్లోనే ప్లాంట్ శంకుస్థాపన కూడా చేసుకుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com