YS షర్మిల పాదయాత్రలో మైల్ స్టోన్..
- November 04, 2022
హైదరాబాద్: వైఎస్ షర్మిల. తెలంగాణలో సంచలనంగా మారారు.అన్న వైస్ జగన్మోహన్ రెడ్డితో విభేదాలతో వేరు కుంపటి పెట్టిన షర్మిల.. వైఎస్సార్ తనయగా.. ఖమ్మం జిల్లా కోడలిగా తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టి సంచలనం రేపారు.పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా.. తెలంగాణతో నీకేం సంబంధమంటూ గేలి చేసినా వెరవక అడుగు ముందుకే వేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టారు. కలిసి వచ్చిన వారిని కలుపుకుంటూ.. వడివడిగా నడుస్తూ మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుని మొండిఘటం అనిపించుకున్నారు.
కొత్త రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల..తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సీఎం కేసీఆర్ మీదనే ఏమాత్రం వెరువకుండా తీవ్ర విమర్శలు చేస్తున్నారు తన పాదయాత్రలో. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామని ప్రతినబూనారు. తన పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు లేకపోయిన అడుగు ముందుకేనన్నారు షర్మిల.
రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ తెలంగాణలో కొత్త రాజకీయ జెండా ఎగరేసిన వైఎస్ షర్మిల సొంత అజెండాతో దూసుకెళ్తున్నారు. ఏపీలో అన్న అధికారంలో ఉన్నా కాదని సొంత కుంపటి పెట్టుకున్నారు. తన జెండా.. సొంత అజెండా ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనా ఉంటే ఏపీలో అన్నతో తేల్చుకోవాలి గానీ ఏం సంబంధం లేని తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని విమర్శలొచ్చినా వెనక్కి తగ్గలేదు. హైదరాబాద్‌లో పుట్టా.. పెరిగా.. ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకున్నా.. ఖమ్మం జిల్లా కోడలిని నేను అంటూ రీసౌండ్ వచ్చేలా బల్లగుద్ది మరీ చెప్పి విమర్శించిన నేతల నోళ్లు మూయించేశారు.
తన తండ్రి వైఎస్సార్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉందని.. మళ్లీ అలాంటి పాలన తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీపై బాణం ఎక్కుపెట్టారు. తన రాజకీయ ప్రస్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. బడాబడా నేతలు వెంటరాకున్నా.. వచ్చిన వారితోనే తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతున్నారు. షర్మిల పాదయాత్రను కనీసం పట్టించుకోని స్థాయి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసి ప్రజల అటెన్షన్ గ్రాబ్ చేశారు.
పార్టీ ప్రారంభంలోనే పదవులు దక్కడం లేదంటూ నేతలు నానాయాగీ చేసినా తనదైన స్టైల్లో చెక్ పెట్టారు. ఉన్నోళ్లకే ప్రాధాన్యం.. పోయేవాళ్లను ఆపబోయేది లేదంటూ రాజన్న రాజసాన్ని చూపించారు. పెద్దపెద్ద నేతల అండ లేకున్నా.. అనుకున్నంతగా పాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలిసిరాకున్నా తండ్రి బాటలో నడకనే ఆయుధంగా ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించి అబ్బురపరిచారు.కరోనా కారణంగా కొద్దిరోజులు విరామం ప్రకటించినా.. తన తండ్రి అభిమానుల మాటల స్ఫూర్తితో మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు.
నేతలు జారిపోతున్నా.. పార్టీ కష్టాల్లో పడిపోయినా ధైర్యం కోల్పోలేదు. మంత్రి మరదలంటే చెప్పుతో కొడతానంటూ తెగువను చూపించారు. వెన్నుచూపని వనితగా తెలంగాణ రాజకీయ యవనికపై తన సొంత అజెండాతో దూసుకుపోతున్నారు షర్మిల. పాదయాత్రకు ముందు ఓ లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా షర్మిల స్పీడు పెంచేశారు. నేతల విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టారు. నిరుద్యోగుల కోసం చేసిన దీక్షలను హేళన చేసిన మంత్రికి దిమ్మతిరిగేలా బదులిచ్చారు. మంగళవారం మరదలంటూ మంత్రి చేసిన పిచ్చి ప్రేలాపనలకు చాచికొట్టినంత పనిచేసింది వైఎస్ బిడ్డ. ఆయన ఊళ్లోనే.. ఆయనకు బుద్ధొచ్చేలా గట్టి గుణపాఠం చెప్పింది. నీ ఊళ్లో నిలబడి చెబుతున్నా.. చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తాను భయపడే రకం కాదని.. భయపెట్టేరకాన్ని అని చాటిచెప్పారు. కంగుతిన్న మంత్రి నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్ధాయి మరిచి మాట్లాడితే పరిస్థితులు మరింత దారుణంగా మారతాయని వార్నింగ్ ఇచ్చారు.
ఇక మంత్రులపై చేసిన విమర్శలు స్పీకర్‌కు అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంపైనా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు షర్మిల. అసెంబ్లీ లోపలికి రమ్మంటారా.. బయట వరకూ రమ్మంటారా అంటూ సవాల్ విసిరారు.. టైమ్ మీరు ఫిక్స్ చేసినా సరే.. నన్ను చెప్పమన్నా సరే అంటూ స్పీకర్‌కే ఆప్షన్ ఇచ్చారు షర్మిల.
నేతలతో మాటల యుద్ధం చేస్తూనే.. ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోయేలా తన కార్యాచరణకు పదునుపెట్టారు షర్మిల. లక్షల కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని.. కేసీఆర్ కుటుంబం ఆ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందని ఆరోపణలు చేసి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి సంచలనంగా మారారు. తనకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్ట్ కంపెనీ వంద కోట్ల ఆఫర్ కూడా ఇచ్చిందంటూ పెనుదుమారం రేపారు.
అధికార పార్టీపై పోరాటం ఒకవైపు.. తాను నిర్దేశించుకున్న లక్ష్యం మరోవైపు.. రెండింటినీ సమన్వయంతో ముందుకు నడిపిస్తున్నారు షర్మిల. మడమ తిప్పేది లేదన్న తండ్రి బాటలో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. ఊరూరా ఉన్న వైఎస్సార్ అభిమానులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి తన పాదయాత్రను పూర్తి చేసి వచ్చే ఏడాదిరానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







