దుబాయ్‌లో 288,037 ట్రాఫిక్ జరిమానాలు జారీ

- November 17, 2022 , by Maagulf
దుబాయ్‌లో 288,037 ట్రాఫిక్ జరిమానాలు జారీ

దుబాయ్‌: రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వారిపై దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో 288,037 ట్రాఫిక్ జరిమానాలు జారీ చేసినట్లు  ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ జుమా బిన్ సువైదాన్ తెలిపారు. ఇందులో లేన్ క్రమశిక్షణను పాటించకపోవడానికి సంబంధించిన కేసులే అధికంగా ఉన్నాయన్నారు. ఆ తర్వాత స్థానాల్లో సెల్ ఫోన్ డ్రైవింగ్, వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్ లేకపోవడం, సిగ్నల్ జంప్, సడెన్ బ్రేకింగ్, ఇతర వాహనదారుల పట్ల దురుసు ప్రవర్తన, నిషేధించిన రహదారుల్లోకి అనుమతి లేకుండా ప్రవేశిండం వంటి నేరాలు ఉన్నాయని కల్నల్ బిన్ సువైదాన్ తెలిపారు. 2022 మొదటి అర్ధ భాగంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ కారణంగా 401 ప్రమాదాలు జరిగాయని, వీటి కారణంగా 7 మంది మరణించగా.. 245 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. అలాగే సిగ్నల్ జంప్ కారణంగా 50 ప్రమాదాలు (నలుగురు మృతి, 64 మందికి గాయాలు) జరిగాయన్నారు. హైవేలపై వాహనాల మధ్య సురక్షిత దూరాన్ని పాటించకపోవడంతో 350 ప్రమాదాలు(9 మంది మృతి, 248 మందికి గాయాలు) చోటుచేసుకున్నాయి. హైవేలపై సడెన్ బ్రేకింగ్ వేయడం ద్వారా 175 ప్రమాదాలు(10 మంది మృతి, 182 మందికి గాయాలు), కారణం లేకుండా రోడ్డుపై వాహనాలు ఆపిన 5 ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని బిన్ సువైదాన్ తెలిపారు. వాహన దారులతోపాటు నిబంధనలు పాటించకుండా రోడ్లను దాటే జైవాకర్లకు 9,416 జరిమానాలు జారీ చేసినట్లు కల్నల్ జుమా బిన్ సువైదాన్ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com