ముంబైలో కొత్తగా 32 మీజిల్స్‌ కేసులు

- November 27, 2022 , by Maagulf
ముంబైలో కొత్తగా 32 మీజిల్స్‌ కేసులు

ముంబై: ముంబైలో మీజిల్స్‌ వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తోంది. నగరంలో కొత్తగా మరో 32 మంది చిన్నారులకు వైరస్‌ సోకిందని బ్రిహిన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) పేర్కొంది. దీంతో మొత్తం మీజిల్స్ కేసుల సంఖ్య 300కి చేరింది. వీటిలో గత రెండు నెలల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 నెలల బాలుడు మీజిల్స్ బారిన పడి మృతి చెందాడు.

దీంతో మీజిల్స్‌తో నగరంలో మొత్తం 13 మంది చిన్నారులు మృతి చెందారు. బీఎంసీ పరిధిలోని ముంబై, మాలేగావ్‌, భీవాండీ, థాణే, నాసిక్‌, అకోలా, కళ్యాణ్‌ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు రికార్డు అవుతున్నాయి. దీంతో ఆరోగ్య సిబ్బంది బైకళా, వర్లీ, వడాల, ధారావి, బాంద్రా, అంధేరీ, మలాడ్‌, గోవండీ, చెంబూర్‌, కుర్లా, భాండూప్‌ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు.

మొత్తం 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్‌-రుబెల్లా స్పెషల్‌ డోసులను పంపిణీ చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్రతోపాటు బీహార్‌, గుజరాత్‌, హర్యానా, జార్ఖండ్‌, కేరళలోనూ మీజిల్స్‌ కేసులు నమోదవు అతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com