ఈ నెల 7న హైదరాబాద్ లో మజ్దూర్ ప్రవాసి దివస్

- January 04, 2023 , by Maagulf
ఈ నెల 7న హైదరాబాద్ లో మజ్దూర్ ప్రవాసి దివస్
  • గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయులను నిర్లక్ష్యం చేస్తున్నారు.  

హైదరాబాద్: జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో భారత ప్రభుత్వం నిర్వహించనున్న 17వ 'ప్రవాసి భారతీయ దివస్' వేడుకల ఎజెండాలో  గల్ఫ్ కార్మికుల సమస్యలకు చోటు దక్కలేదు. ప్రభుత్వం ప్రవాసి దివస్ వేడుకలను సంపన్న ఎన్నారైల జాతరగా  నిర్వహిస్తూ.. గరీబు గల్ఫ్ కార్మికుల సమస్యలను చర్చించడానికి అవకాశం ఇవ్వడం లేదని తెలంగాణ గల్ఫ్ కార్మికుల జెఏసి చైర్మన్ గుగ్గిళ్ల రవిగౌడ్ ఒక ప్రకటనలో విమర్శించారు. 

ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను విస్మరించినందున... వారి గొంతు వినిపించడానికి గల్ఫ్ జెఏసి పక్షాన హైదరాబాద్ లో జనవరి 7న 'మజ్దూర్ ప్రవాసి దివస్' ను నిర్వహిస్తున్నామని రవిగౌడ్ తెలిపారు. ప్రభుత్వం ఎన్నారైల పెట్టుబడులపై మాత్రమే ప్రేమ చూపుతూ ప్రవాసీల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చూపుతున్న శ్రద్ధ కార్మికుల కష్టాలపై చూపడం లేదు.మానవ వనరులను ఎగుమతి చేస్తూ.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ మనుషులతో ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు.  

ప్రవాసి దివస్ లో నిర్వహిస్తున్న అయిదు ప్లీనరీలలో ఒకదానిలో మాత్రం 'ఎనేబ్లింగ్ గ్లోబల్ మొబిలిటీ ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ - రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా'  (భారతీయ శ్రామిక శక్తి యొక్క ప్రపంచ చలనశీలత కు అవకాశం ఇవ్వడం - భారత ప్రవాసుల పాత్ర) అనే అంశం ఉన్నది. 88 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. స్పష్టంగా, ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల కొరకు ఒక ప్లీనరీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము.  

గల్ఫ్ కార్మికులు విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా ఆర్జించి పెడుతున్నారు.గల్ఫ్ నుంచి  తిరిగివచ్చిన వారి పునరావాసం కోసం పథకాలను రూపొందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. కరోనా మహమ్మారి వలన విదేశాలలో ఉపాధి, జీవనోపాధి కోల్పోయిన భారతీయ వలసదారులు పెద్ద సంఖ్యలో తిరిగి వచ్చారు.స్వదేశానికి తిరిగి వచ్చిన చాలా మంది కార్మికులు వారి జీతం బకాయిలు, ఉద్యోగ ముగింపు ప్రయోజనాలు పొందలేక  అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

● భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి... యూఏఈ,  సౌదీ అరేబియా, కువైట్  దేశాలను ఒప్పించి హైదరాబాద్ లో కాన్సులేట్ (దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు చేయించాలి. 

● 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పాలసీలో సహజ మరణం కూడా కవర్ అయ్యేలా ఇన్సూరెన్స్ లోని నిబంధనలు సవరించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. 

 ● ఖతార్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన అందరు వలస కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఫిఫా, ఖతార్ పై భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి.  

● ఎన్నారైలు అందరికీ ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలి. 
  
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన మరో 30 లక్షల మంది కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు' ఏర్పాటు చేయాలి. రాబోయే బడ్జెట్ సమావేశాలలో చట్టం చేసి 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేసి రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి.గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని రవిగౌడ్ కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com