గల్ఫ్ నుండి ఇండియాకు ఎంత బంగారాన్ని తీసుకురావచ్చు?

- January 09, 2023 , by Maagulf
గల్ఫ్ నుండి ఇండియాకు ఎంత బంగారాన్ని తీసుకురావచ్చు?

భార‌త్‌తో పాటు పోలిస్తే.. గల్ఫ్ లో 14 శాతం నుంచి 20 శాతం వరకు బంగారం ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయి. గల్ఫ్ దేశాల్లో కొన్నాళ్లు పాటు ఉండి.. అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే సమయంలో బంగారు ఆభరణాలను తీసుకురావాలని చాలామంది భావిస్తుంటారు. ఇండియాలోని బంధువులు కూడా ఆయా దేశాల నుంచి వచ్చే వారిని బంగారం కొని తేవాలని అడుగుతుంటారు.

గోల్డ్ సిటీగా ప్రసిద్ధి చెందిన దుబాయ్ లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.దుబాయ్‌లో బంగారం రేటు అంతర్జాతీయ బంగారు విలువలపై ఆధారపడి మారుతూ ఉంటుంది.  కాబట్టి దుబాయ్‌లో బంగారం కొనుగోలుదారులు సాధ్యమైనంత తక్కువ ధరలో బంగారాన్ని కొనవచ్చు. అయితే, భారతదేశానికి వచ్చే వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ కొన్ని సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి ఎంత బంగారం దిగుమతి చేసుకోవచ్చనే దానిపై పరిమితులు విధించింది.

ఏప్రిల్ 1, 2016న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చే భారతీయ ప్రయాణికులు ఏదైనా బంగారు ఆభరణాలను తమతో తీసుకురావచ్చని ప్రకటించింది. భారత్‌తో పోలిస్తే.. గల్ఫ్ దేశాల్లో బంగారం ధర సాధారణంగా చాలా తక్కువగా ఉంటాయి. కానీ, మేకింగ్ ఛార్జీలు, కరెన్సీ మార్పిడి ఖర్చులు, దిగుమతి సుంకం, పన్ను నియమాలు, GST వంటి ఇతర లెక్కలు చూసుకుంటే బంగారం కొని ఇండియాకు తేవడం లాభదాయకం కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

పన్ను లేకుండా ఎంత బంగారం తేవచ్చంటే..

భారతీయ పన్ను నిబంధనల ప్రకారం.. ఎవరైనా గల్ఫ్ దేశాల నుంచి చాలా తక్కువ మొత్తంలో బంగారాన్ని తీసుకువచ్చేందుకు అనుమతి ఉంటుంది. ఆయా దేశాల నుంచి బంగారం, వెండిని ఆభరణాల రూపంలో మాత్రమే తేవచ్చు. ఒక ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పురుషులు బోనాఫైడ్ బ్యాగేజీలో డ్యూటీ లేకుండా రూ.50వేలు విలువైన 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను తీసుకురావచ్చని పన్ను నిపుణులు అంటున్నారు. ఒక మహిళా ప్రయాణీకురాలు దుబాయ్ నుంచి ఒక లక్ష (రూ.1,00,000) విలువ కలిగిన 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను మాత్రమే ఇండియాకు తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తంలో బంగారాన్ని ఇండియాకు తీసుకువస్తే మాత్రం.. 12.5 శాతం వ‌ర‌కు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ప‌న్ను చెల్లించి తీసుకెళ్లే బంగారంపై ఎలాంటి పరిమితి ఉండ‌దు. ఎంతైనా కొని తీసుకురావ‌చ్చు.

భారత్‌లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) బంగారంపై డ్యూటీ-ఫ్రీ అలవెన్స్‌ను ఆభరణాల రూపంలో మాత్రమే అనుమతిస్తుంది. నాణేలు, బార్‌లు, బులియన్‌ల వంటి ఇతర రూపాల్లో బంగారాన్ని అనుమతి ఉండదనే విషయాన్ని తప్పక గుర్తించుకోవాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com