దుబాయ్ లో ఏ.ఎల్ మల్లయ్యకు ఘన నివాళి

- March 07, 2023 , by Maagulf
దుబాయ్ లో ఏ.ఎల్ మల్లయ్యకు ఘన నివాళి

దుబాయ్: దుబాయ్ లో ఏ.ఎల్ మల్లయ్యకు విధ్యుత్ దీపాలతో ఘన నివాళి.ఏ.ఎల్ మల్లయ్య కాంక్షించిన సమానత్వం, సామాజిక తెలంగాణ ను తప్పక ఆవిష్కృతం చేస్తాం.బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్.మూడు తరాల ఉద్యమ నాయకులు, బీసీ, బహుజన బాంధవులు సర్దార్ ఏ.ఎల్ మల్లయ్య మృతి అణగారిన వర్గాలకు తీరని లోటు అని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు.ఏ.ఎల్ మల్లయ్య కు దుబాయ్ వేదికగా విద్యుత్ దీపాలతో ఘనమైన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దుబాయ్ లో నివాసముంటున్న తెలుగు రాష్ట్రాల గల్ఫ్ కార్మికులు పాల్గొని పూలతో నివాళులు అర్పించారు.

తదనంతరం దాసు సురేష్ మాట్లాడుతూ దేశంలోని మత్స్య కార్మికులకు మల్లయ్య ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు…ఎల్ మల్లయ్య గారి చొరవ వల్లనే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపన జరిగిందన్నారు. మత్స్య కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభత్వాలు రూపొందిచడం లో మల్లయ్య ప్రధాన భూమిక పోషించారన్నారు. మల్లయ్య  చొరవతో దేశ వ్యాప్తంగా 16 కోట్ల మంది మత్స్య కార్మికులు, ఫెడరేషన్లు, సంఘాలు లబ్ధిదారులు కాగలిగారన్నారు.

ఏ.ఎల్ మల్లయ్య నేతృత్వంలో ప్రధానమంత్రి మోడీ తో జరిపిన చర్చల ప్రతిఫలంగా మత్స్య కార్మికుల సంక్షేమం కోసం రూపొందించిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా  కోటి రూపాయల వరకు మత్స్య కార్మికులు, సంఘాలు లబ్ది పొందే అవకాశాన్ని 30 లక్షల మంది మత్స్య కార్మికులకు కల్పించారన్నారు.ఇందులో 50 లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా 50 లక్షల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు పొందే అవకాశాన్ని కల్పించారని తెలిపారు.

మత్స్య కార్మికుల సంక్షేమం మాత్రమే కాకుండా అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాల కోసం బీసీ దళిత మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఏ ఎల్ మల్లయ్య అనేకమంది ముఖ్య నాయకులతో కలిసి పనిచేశారన్నారు..తెలంగాణ ప్రాంతంలో దొరల పెత్తనాన్ని అన్ని దశలలో వ్యతిరేకించారన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్ధార్ గౌతు లచ్చన్న వంటి అనేకమంది బీసీ బహుజన నాయకులతో అలుపెరుగని కృషి సల్పారన్నారు ..ఇంతటి ఘన చరిత్ర కలిగిన మల్లయ్య జీవిత చరిత్రను ప్రాధమిక విద్య లో పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపారు. 

ఏ.ఎల్ మల్లయ్య ఆశించిన వెనుకబడిన కులాలకు సమానత్వం, సాధికారత, రాజ్యాధికారం, సామాజిక తెలంగాణ అంశాలు నేటికీ నెరవేరని అంశాలుగానే మిగిలాయని సామాజిక తెలంగాణను సదృశ్యం చేసే విధంగా తమ భవిష్యత్ ప్రణాళిక ఉండబోతుందని, సబ్బండ వర్గాలు సమాన అవకాశాలు పొందే సామాజిక తెలంగాణ ను తప్పక సాధిస్తామని అదే తాము ఏ ఎల్ మల్లయ్య గారికి ఇచ్చే ఘన నివాళి అని దాసు సురేశ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై పాలసీ సాధన సమితి గల్ఫ్ ముఖ్య నాయకులు మోతె రామన్న,ఉట్నూరు రవి , కోరెపు మల్లేశ్ , జైత నారాయణ, వంశీ గౌడ్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com