అంతర్జాతీయ వేదికగా పాక్ కు ఘోర అవమానం

- March 08, 2023 , by Maagulf
అంతర్జాతీయ వేదికగా పాక్ కు ఘోర అవమానం

యునైటెడ్‌ నేషన్స్‌: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ (Pakistan)కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐరాసలో మహిళల భద్రతపై చర్చ సందర్భంగా కశ్మీర్‌ (Kashmir Issue) అంశాన్ని లేవనెత్తిన దాయాది పాక్‌కు భారత్‌ (India) గట్టి సమాధానమిచ్చింది.

అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే అని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి (United Nations) భద్రతా మండలిలో 'మహిళ, శాంతి, భద్రత' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ (Pakistan) విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. మరోసారి జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఐరాస (UN)కు భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ (Ruchira Kamboj) ఘాటుగా స్పందించారు. ''ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భద్రత, శాంతియుత పరిస్థితులను నెలకొల్పాలనే ముఖ్యమైన అంశంపై చర్చ జరుపుతున్నాం. ఈ చర్చ ఆవశ్యకతను మేం గుర్తించి దానికి పూర్తి గౌరవిస్తున్నాం. దానిపైనే మా దృష్టంతా. ఈ సమయంలో జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ ప్రతినిధులు చేసిన పనికిమాలిన, నిరాధారమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి ద్వేషపూరిత, అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగే'' అని ఆమె మండిపడ్డారు.

కశ్మీర్‌ (Kashmir) అంశాన్ని ఎత్తిచూపి అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాక్‌ గతంలోనూ పలుమార్లు ప్రయత్నించి భంగపాటుకు గురైన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమేనని, వాటిపై ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ ఇదివరకే దాయాదికి గట్టిగా చెప్పింది. పొరుగు దేశంతో తాము సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నామని న్యూదిల్లీ మరోసారి స్పష్టం చేసింది. అయితే ఆ బంధం కొనసాగాలంటే.. బీభత్సం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పైనే ఉందని నొక్కి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com