టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్..

- March 21, 2023 , by Maagulf
టాప్-10లో చోటు కోల్పోయిన రఫెల్ నాదల్..

టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడైన రఫెల్ నాదల్ తాజాగా టాప్-10 జాబితాలో చోటు కోల్పోయాడు.నాదల్ ఇలా టాప్-10లో చోటు దక్కించుకోకపోవడం 2005 తర్వాత ఇదే తొలిసారి. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో దాదాపు 17 ఏళ్లకు పైగా అతడు టాప్-10లో కొనసాగాడు.

ఏటీపీకి సంబంధించిన ర్యాంకింగ్స్ సోమవారం వెల్లడయ్యాయి.దీని ప్రకారం అతడు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు తొమ్మిదో స్థానంలో ఉండేవాడు. తాజాగా 4 స్థానాలు దిగజారాడు.దీంతో 912 వారాలపాటు టాప్-10లో కొనసాగిన అతడి జైత్రయాత్రకు బ్రేక్ పడినట్లైంది. క్యాలిఫోర్నియాలో జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌కు అతడు దూరమవ్వడం వల్ల పాయింట్లు తగ్గాయి. తన 600 పాయింట్లను అతడు నిలుపులేకపోయాడు. దీంతో టాప్-10 నుంచి కిందికి దిగజారాడు. స్పెయిన్ దిగ్గజ ఆటగాడైన నాదల్ తన కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ టైటిళ్లు గెలుపొందాడు.

కొంతకాలంగా నాదల్ ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో తాజా టోర్నీకి దూరమయ్యాడు. అయితే, త్వరలో జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తా చాటితే మళ్లీ తిరిగి టాప్‌లోకి చేరే అవకాశం ఉంది.ఇప్పటికే నాదల్ 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకుని ఉన్నాడు.దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ విజయం సాధించి మళ్లీ తన సత్తా నిరూపించుకునే అవకాశం ఉంది. టెన్నిస్‌కు సంబంధించి సెరెనా విలియమ్స్, రోజర్ ఫెదెరర్ గత ఏడాది వీడ్కోలు చెప్పగా, నాదల్, జకోవిచ్ మాత్రం ఇంకా కొనసాగుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com