పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలలో 6.5 తీవ్రతతో భూకంపం.. 11 మంది మృతి

- March 22, 2023 , by Maagulf
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలలో 6.5 తీవ్రతతో భూకంపం.. 11 మంది మృతి

యూఏఈ: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలలో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంభవించిన భూకంపంలో 11 మంది మృతి చెందినట్లు సమాచారం. భూప్రకంపనలతో భయాందోళనలకు గురైన నివాసితులు ఇళ్లు, కార్యాలయాల వదిలి బయటకు పరుగులు తీశారు. పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలోని ఆసుపత్రులలో 100 మందికి పైగా ప్రజలు జాయిన్ అయినట్లు పాకిస్థాన్ అత్యవసర సేవల ప్రతినిధి బిలాల్ ఫైజీ చెప్పారు. వాయువ్య పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పైకప్పులు కూలి తొమ్మిది మంది మరణించారని ఫైజీ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తజికిస్థాన్ సరిహద్దులో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భూకంపం కారణంగా కొన్ని పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు కనీసం ఇద్దరు మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖకు తాలిబాన్ నియమించిన ప్రతినిధి షరాఫత్ జమాన్ అమర్ తెలిపారు.

ఇదిలా ఉండగా.. 6.5 తీవ్రతతో భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని పర్వత ప్రాంతాలైన హిందూకుష్ ప్రాంతంలోని జుర్మ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 40 కిలోమీటర్లు (25 మైళ్ళు) దూరంలో పాకిస్తాన్, తజికిస్థాన్ సరిహద్దులో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం భూమి ఉపరితలం నుండి 188 కిలోమీటర్ల (116 మైళ్ళు) లోతులో ఉందని, దీని కారణంగా విస్తృత పరిధిలో ప్రభావం చూపిందని  పేర్కొంది. 2005లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల పాకిస్థాన్, కాశ్మీర్‌లో వేలాది మంది చనిపోయారు. అలాగే గత సంవత్సరం ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 1,150 మంది మరణించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com