సింగపూర్‌లో శోభాయమానంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రత్యేక పూజలు
- March 25, 2023
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం మరియు రాబోవు సంవత్సరమంతా అందరికీ శ్రేయస్కరంగా ఉండాలనే మహా సంకల్పంతో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం మరియు విశేషపూజలతో పాటు , విష్ణుదుర్గ అమ్మవారికి అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంనందు మార్చి 22, 2023 బుధవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో , శాస్త్రోక్తంగా , కోలాహలంగా గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు.సింగపూర్ లోనే కోవిడ్-19 నిబంధనలను పూర్తిగా సడలించిన తరువాత వచ్చిన ఉగాది కావటంతో సింగపూర్ తెలుగు సమాజం శోభాయమానంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయగా వారాంతము కాకపోయినూ భారీగా తరలివచ్చిన భక్తకోటి ఆ దేవదేవుని దర్శించుకొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం బ్రహ్మోత్సవాల చివరి రోజు ఈసారి ఉగాదిన రావటం విశేషం కాగా, సంవత్సరం లో కేవలం 4 సార్లు మాత్రమే అరుదుగా దేవాలయం వెలుపలకు వచ్చే ఉత్సవ మూర్తులకు తెలుగువారు ఉగాది న అనేక సేవలు చేయడం మరో విశేషం.
కళ్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఉదయము పూట కూడా సుమారు గంటసేపు పంచాంగ శ్రవణాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా ఏర్పాటుచేసారు.
తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగు వారందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు ,ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని ఆకాంక్షించారు.కళ్యాణోత్సవం లో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తి. తి. దే. కార్యవర్గ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహాయ సహకారాలతో తీసుకొని వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ, వడ ప్రసాదాలను, మంగళ ద్రవ్యాలను, బహుమానాన్ని అందచేసామని తెలిపారు.
కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా సుమారు 3,000 మంది వీక్షించారని, అలానే ఈ ఉగాది నాడు సుమారు 2,000 మందికి సింగపూర్ లోనే అరుదుగా లభించే వేప పువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని సుమారు 6,000 మందికి పైగా అందించామని, కార్యక్రమానికి హాజరైన వారికి అన్నప్రసాదాన్ని అందించామని కార్యక్రమ నిర్వాహకులు బచ్చు ప్రసాద్ తెలియచేసారు. తమ కుటుంబాలకు దూరంగా సింగపూర్ నివశిస్తున్న కార్మిక సోదరులకు కూడా ఉగాది పచ్చడిని అందించామని తెలిపారు. స్ధానికులు కూడా ఉగాది పచ్చడిని సేవించి దాని విశిష్ఠతను తెలుసుకోవడం గమనార్హం.
కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు , దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు, భక్తులకు ,పంచాంగ శ్రవణం చేసిన పండితులకి ,వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన మరియు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.



తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







