వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శత చండీ హోమం

- March 26, 2023 , by Maagulf
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శత చండీ హోమం

సింగపూర్: సింగపూర్ లోని అత్యంత పురాతన మరియు ఎంతో విశిష్టమైన ఆలయాల్లో శ్రీ మారియంబికా ఆలయం ఒకటి, ఇది సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయమే కాకుండా సింగపూర్ జాతీయ వారసత్వ సంపదల్లో ఒక శక్తివంతమైన ఆలయం. హిందూ ఎండోమెంట్ బోర్డు మరియు ఆలయ యాజమాన్యం ఇచ్చిన పిలుపుమేరకు స్థానిక ఆర్యవైశ్య సంఘమైన వాసవి క్లబ్ సభ్యులందరు కలిసి గత తొమ్మిది నెలలుగా ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాల్లో వీరివంతు కృషిగా వివిధరకాలుగా అమ్మవారి కార్యక్రమాల్లో మునిగితేలారు.

ఈ తొమ్మిది నెలలుగా ఇక్కడి వైశ్యులు విరివిగా ఆలయమునకు తగిన విరాళాలు అందించడమే కాకుండా ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు అమ్మవారి దీవెనలతో చక్కగా జరగాలని అనునిత్యము విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగించారు, ఇది కొనసాగించిన వారిలో ప్రముఖంగా విజయ్ సారధి పాడి, శ్రీకాంత్ నూతిగట్టు, సరితా దేవి, శ్రీమతి దివ్య గాజులపల్లి,  భార్గవి, హేమ కిషోర్,  రాజశేఖర్ గుప్త, శ్రీవాణి పాత్ర ఎంతైనా వుంది.  అంతేకాకుండా ప్రతినెలా రెండు మూడు మార్లు అందరు ఒక్కొక్కళ్ళ ఇంట్లో అమ్మవారి సామూహిక పార్ధనల్లో ముఖ్యంగా లలితా పారాయణం, వాసవి అష్టోత్తరం, మణిదీపవర్ణన, అమ్మవారి భజనలు గత తొమ్మిది నెలలుగా నిర్విరామంగా కొనసాగించారు. ఈ ఇంటింటి కార్యక్రమ సమానవ్యకర్తలుగా సరితా దేవి, చైతన్య పురుషోత్తం, వాసవి ఫణీష్, హేమ కిషోర్ ల సహకారంతో దిగ్విజయంగా చేసుకొన్నారు. అలానే అనునిత్యం సర్వసభ్య నామ పరాయణంలో సభ్యులందరు అమ్మవారి నామాన్ని లక్షార్చన యజ్ఞంగా అలవర్చుకుని అనునిత్య పార్ధనల్లో మునిగి తేలారు. 

గత నెలలో అమ్మవారి ఆలయ కుంభాభిషేకం పూర్తి చేసుకొని, ఈ కార్యక్రమంలో చివరి ఘట్టంగా మండలపూజల్లో భాగమైన అనునిత్య శత చండీ హోమములు నిర్వహిస్తూ చివరిరోజు యజ్ఞంలో స్థానిక వైశ్యులందరు పాల్గొని అమ్మవారి దీవెనలు పొందారు. 

ఈ మొత్తం 270 రోజుల కార్యక్రమ రూపకర్త అయిన క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి  మొత్తం కార్యక్రమ సంక్షేమ బాధ్యతలన్నీ క్లబ్ సీనియర్ సభ్యుడైన ముక్కా కిషోర్ కి అప్పగించి వారిచేత ఈ మొత్తం కార్యక్రమాన్ని నడిపించారు. 

అరుదుగా వచ్చే ఇటువంటి మహత్తర అవకాశాన్ని వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో ఇక్కడి ఆర్యవైశ్య కుటుంబాలు అందిపుచ్చుకొని, తమ విరాళాలను గుడికి అందచేయటమే కాక, గత తొమ్మిది నెలలుగా పైన పేర్కొన్న విధంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకొంటూ, విశిష్టమైన రీతిలో భక్తి మార్గాన్ని అనుసరించారు

ఎంతో అరుదైన మహా కుంభాభిషేకం వంటి సదవకాశం, వాసవి క్లబ్ దశమ వార్షికోత్సవ సమయంలో తటస్థించటం కేవలం కాకతాళీయం మాత్రమే కాదు, ఇచ్చటి ఆర్యవైశ్యులపై శ్రీ వాసవి అమ్మ వారి కృపకు నిదర్శనం అని క్లబ్ వ్యవస్థాపక గౌరవాధ్యక్షులైన వెంకట్ నాగరాజ్ కైలా మరియు క్లబ్ గౌరవ సెక్రటరీ అయిన మంచికంటి శ్రీధర్ గారు అన్నారు. 

నిరంతరాయంగా తొమ్మిది నెలలపాటు సింగపూర్ వంటి దూర తీరాలలో మన హైందవ సంస్కృతిని యువతరానికి, పిల్లలకు పరిచయం చేస్తూ, ఇంతటి భక్తి ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోగలగటం ఇక్కడి ఆర్యవైశ్యుల సంఘీభావానికి నిదర్శనమని క్లబ్ అధ్యక్షులైన అరుణ్ కుమార్ గట్లూరు మరియు క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి  సంక్షిప్త సమాచారంలో సభ్యులనుద్దేశించి పంపడం జరిగింది. 

వాసవి క్లబ్ లో సీనియర్ సభ్యలైన మురళి కృష్ణ పబ్బతి, రాజశేఖర్ గుప్త, మకేష్ భూపతి మరియు నూతన సభ్యులైన సుమన్ రాయల,  ఆనంద్ గందె,వినయ్, శ్రీ కిషోర్ శెట్టి, సరిత, ఫణీష్ & వాసవి గార్లు మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాద భలం లేకపోతే ఇంతటి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరిని సమన్వయము చేసుకొంటూ వెళ్లడం అసాధ్యమని ముక్తకంటంగా చెప్పడం విశేషం. 

కార్యక్రమం చివరిగా హాజరైన 200 మంది పైగా సభ్యులకు అమ్మవారి ప్రసాద వితరణ, భోజన కార్యక్రమాలతో పాటు వాసవి క్లబ్ కార్యక్రమాలకు ముందుకు నడిపించడంలో నిస్వార్ధంగా సేవచేసుకుంటున్న సేవాదళ్ సభ్యలందరికి క్లబ్ వారి చిరు సత్కారాలతో సత్కరించుకొన్నారు, అలానే ఆలయ  శేఖర్ శర్మ, కృష్ణ స్వామి  అంతేకాక ఆలయ యాజమాన్యం నుండి కదిరీషన్ మరియు శ్రీనివాస్ బోబ్బా కి చిరు సత్కారం జరుపుకోవడం జరిగింది. చివరిగా ప్రతినెలా గృహ ఆత్యాద్మిక సేవలందించిన వారికీ, అను నిత్యం నామయజ్ఞంలో పాల్గొన్నవారందిరికి సర్టిఫికెట్స్ మరియు అమ్మవారి పీఠికలను బహుకరించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com