ప్రయాణికులతో మర్యాదగా మెలగాలి: TSRTC ఎండీ సజ్జనర్
- April 21, 2023
హైదరాబాద్: ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని కండక్టర్లకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు. సంస్థకు కండక్టర్లు, డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లని, క్షేత్రస్థాయిలో జాగ్తత్తగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. చిన్న పొరపాట్ల వల్ల టీఎస్ఆర్టీసీ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించారు. టీఎస్ఆర్టీసీ బ్రాండ్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. సంస్థ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్(టాక్ట్) శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా ఈ శిక్షణ జరుగుతున్న తీరును సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. శిక్షణలో పాల్గొన్న కండక్టర్లతో ముచ్చటించారు. శిక్షణ జరుగుతున్న తీరు, శిక్షణలో చెబుతున్న విషయాల ఉపయోగం, తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు.
”మనం ప్రయాణికుల కేంద్రంగానే పనిచేయాలి. ప్రయాణికులతో ఎట్టి పరిస్థితుల్లోనూ దురుసుగా ప్రవర్తించొద్దు. బస్సులోకి రాగానే వారిని నమస్తే అంటూ చిరునవ్వుతో పలకరించాలి. కొత్త ప్రయాణికులను మన సంస్థ వైపు మెగ్గుచూపేలా వ్యవహారించాలి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలి. విధి నిర్వహణలో స్వీయ క్రమశిక్షణను కలిగి ఉండాలి” అని కండక్టర్లకు సంస్థ ఎండీ సజ్జనర్ హితవు పలికారు. గత ఏడాదిన్నర కాలంలో సంస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, అందుకే టాక్ట్ పేరుతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామన్నారు.
”రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) 69గా ఉంది. దానిని 75కి పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి టాక్ట్ పేరుతో శిక్షణ ఇస్తున్నాం. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి” అని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ శిక్షణ స్పూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి.. సంస్థ లాభాల బాటలో పయనించేలా పాటుపడాలన్నారు.
ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలోని దాదాపు 6 వేల మంది డ్రైవర్లకు టాక్ట్ శిక్షణను ఇచ్చామని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో సంస్థలోని సిబ్బంది అందరికీ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. టాక్ట్ పేరుతో తమకు అందిస్తోన్న ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తంగా ఉందని కండక్టర్లు సంస్థ ఎండీ సజ్జనర్‌కు చెప్పారు. తమలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రయాణికుల మీదనే సంస్థ ఆధారపడి ఉందనే విషయాన్ని తాము మరిచిపోమన్నారు. ఓఆర్‌ను 75కి పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







