రష్యా ఆరోపణల పై ఉక్రెయిన్ స్పందన

- May 03, 2023 , by Maagulf
రష్యా ఆరోపణల పై ఉక్రెయిన్ స్పందన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను హత్య చేయడానికి తాము డ్రోన్లను పంపి దాడికి యత్నించామంటూ వస్తున్న ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. తమకు ఏ సంబంధమూ లేదని స్పష్టం చేసింది. తాము క్రెమ్లిన్ పై డ్రోన్ దాడి చేయలేదని చెప్పింది.

అసలు ఇటువంటి చర్యల వల్ల ఉక్రెయిన్ కు చేకూరే లాభము ఏమీ ఉండబోదని, అంతేగాక, రష్యాను మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని చెప్పింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ వివరణ ఇచ్చారు. క్రెమ్లిన్ పై ఉక్రెయిన్ దాడులు చేయబోదని, ఇటువంటి దాడులు తమ మిలటరీ లక్ష్యాలు కాదని చెప్పారు.

ఈ దాడి అంతా రష్యా డ్రామా అని అన్నారు. ఉక్రెయిన్ పై “ఉగ్ర” దాడులు చేయడానికి ముందుగా రష్యా ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. పుతిన్ కు ఉక్రెయిన్ దాడిలో గాయాలు కాలేదని, ఆయన షెడ్యూల్ లో మార్పులు ఏవీ లేవని ఇప్పటికే రష్యా ప్రకటించింది. అయితే, ఆ దాడి ఉక్రెయినే చేసిందన్న విషయంలో రష్యా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలూ బయటపెట్టలేదు. త్వరలోనే ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ భీకర దాడులు చేసేందుకు సిద్ధమవుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com