తిరుమలను శుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలి: జస్టిస్ ఎన్వీ రమణ

- May 13, 2023 , by Maagulf
తిరుమలను శుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలి: జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల: తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం టీటీడీ నిర్వహించిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డితో కలసి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. తిరుమల కొండలు పరమ పవిత్రమైనవని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దేవుడి గదిలా భావించి శుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిలో ప్రతి భక్తుడు భాగస్వాములు కావాలని కోరారు. 2008లో ఈవో శ్రీ ధర్మారెడ్డిని తమకు ఇలాంటి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన తెలిపారు. భగవంతుడు తనకు ఇన్నాళ్లకు ఆ అవకాశం ఇచ్చారని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈవో తనను ఆహ్వానించారని ఆయన తెలిపారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని, ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com