మంత్రముగ్దులను చేసిన తన్మయి ఆర్ట్ స్టూడియో ‘నృత్యార్చన’
- May 22, 2023
దుబాయ్: ప్రీతి తాతంభొట్ల స్థాపించిన తన్మయి ఆర్ట్ స్టూడియోచే మే 20న 'దుబాయ్ హైట్స్ అకాడమీ' లో నిర్వహించిన మెగా కూచిపూడి 'నృత్యార్చన' కార్యక్రమం ఆహుతులను మంత్రముగ్దులను చేసింది. యూఏఈ లోనే మొట్టమొదటిసారిగా జరిగిన ఈ కూచిపూడి కార్యక్రమానికి అశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు, దర్శకుడు, రచయిత, కవి తనికెళ్ళ భరణి, భారత కాన్సుల్ జనరల్ డా. అమన్ పూరి, SRR ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ కుమార్ తోట, గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

శ్రావణి తెన్నేటిచే కూచిపూడి ఆవాహనతో కార్యక్రమం ప్రారంభమైంది. అటుపై తన్మయి ఆర్ట్ స్టూడియోలోని జూనియర్లు మరియు సీనియర్ల బృందం తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. ప్రదర్శనలలో భాగంగా కనబరిచిన మనోహరమైన హస్త అభినయ, శ్లోకాలు, అన్నమాచార్యుల కీర్తనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. శోభా నాయుడు ప్రదర్శించిన కూచిపూడి డ్యాన్స్ డ్రామా "కల్యాణ శ్రీనివాసం" ఈ ఈవెంట్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ వైకుంఠాన్నే దుబాయ్ లో నిలబెట్టేశారా అన్నరీతిన సాగిన "కల్యాణ శ్రీనివాసం", ప్రేక్షకులను తన్మయత్వానికి లోనుచేసింది. ఈ వేదిక పైన ప్రీతి తాతంభొట్ల నృత్య రంగంలో తనకుగల అద్భుత ప్రతిభను కనబరిచి ప్రేక్షకుల నుండి జయధ్వానాలు అందుకున్నారు.



గౌరవ అతిధిగా విచ్చేసిన తనికెళ్ళ భరణి మాట్లాడుతూ "ఒక కళాకారుడికి హాలు నిండటం అంటే మనసు నిండినట్టే..నేడు ఈ కార్యక్రమానికి లభించిన స్పందన చూస్తుంటే..ఒక కళాకారుడిగా ఎంతో గర్వంగా ఉంది. పిల్లలు కనబరిచిన ప్రతిభ నిజంగా స్లాఘనీయం. వీరికి పేరు పేరునా నా ఆశీస్సులు. ఇటువంటి కళలను ప్రోత్సహించడం ఎంతో అవసరం...రేపటి భవిష్యత్తుకు ఈ సంస్కృతీ, సంప్రదాయాలు దిక్సూచి. విదేశాల్లో మన కళలలకు అమితంగా ఆదరణ లభిస్తుండడం చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతోంది. 'కళ్యాణ శ్రీనివాసం' చూశాక ఆత్మసంతృప్తితో ఇండియా వెళ్తున్నా" అంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
_1684826023.jpg)
భారత కాన్సల్ జనరల్ డా.అమన్ పూరి మాట్లాడుతూ "ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి రావటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మన భారత సంస్కృతిని అభివృద్ధి పరచడంలో మా సహాయసహకారాలు ఎల్లప్పుడూ కమ్యూనిటీ కి అందుతాయి. అద్భుత ప్రతిభ కనబరిచిన పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్." అని అన్నారు.

ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరించిన డాక్టర్ రామ్ కుమార్ తోట మాట్లాడుతూ..."మన కళలను ఇలా అంతర్జాతీయ వేదిక పై పదర్శించటం, అందులో నేను భాగం అవ్వటం చాల ఆనందంగా ఉంది.ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలి" అని అన్నారు.

తన 9 సంవత్సరాల వయసు నుంచే నాట్యాన్ని అభ్యసించటం ప్రారంభించిన ప్రీతి, గత 16 సంవత్సరాలకు పైగా అంకితభావంతో గురువైన డాక్టర్ శోభా నాయుడు దగ్గర శిక్షణ పొంది నేడు అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. ఈ సందర్భంగా ప్రీతి తాతంభొట్ల మాట్లాడుతూ "మా గురువు ఇచ్చిన ప్రతిభ మరియు ధైర్యంతో నేడు ఈ కార్యక్రమాన్ని చేయగలిగాను. విదేశాల్లో ఒక సాంస్కృతిక కళకు ఇంత ఆదరణ లభించడం ఆనందాన్ని ఇస్తోంది. పిలల్లు మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఈ కళపై ఉన్న మక్కువతో ఎంతో దూరాలనుండి వచ్చి మరీ నృత్యాన్ని నావద్ద నేర్చుకోవటం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం చేయగలిగాను అంటే, నా స్టూడెంట్స్ మరియు నా కుటుంబం అందించిన సహాయసహకారాలే కారణం. స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండులు అందించిన సహాయం మాటల్లో చెప్పలేనిది..వారికి నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. అంతేకాకుండా, నన్ను..ఈ కార్య్రక్రమాన్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు మరియు స్పాన్సర్లకు నా కృతఙ్ఞతలు." అని అన్నారు.
తాజా వార్తలు
- ఖతర్‌లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









