ఏపీ రాష్ట్రానికి చల్లని కబురు..

- June 11, 2023 , by Maagulf
ఏపీ రాష్ట్రానికి చల్లని కబురు..

అమరావతి: భానుడి భగభగలతో, తీవ్రమైన వడగాలులతో కొన్నిరోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. అవును, ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర శ్రీహరికోట, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి.. కర్నాటకలోని శివమొగ్గ, హసన్ తదితర ప్రాంతాలపై ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవి కాలం జనాలకు చుక్కలు చూపించింది. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. మాడు పగిలిపోయే ఎండలతో, తీవ్రమైన వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెల ముగిసి జూన్ లోకి ఎంటర్ అయినా ఇంకా భానుడు నిప్పులు కక్కుతుండటంతో విలవిలలాడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఎండాకాలం పోతుందా, వాతావరణం చల్లబడుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ఎంటర్ అయిపోయాయి. ఇక, రుతుపవనాల రాకతో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని, ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుందని అంతా ఆశిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com