ఈజిప్ట్ పర్యటనకు ప్రధాని మోదీ..

- June 24, 2023 , by Maagulf
ఈజిప్ట్ పర్యటనకు ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటనకు వెళ్లారు. మూడు రోజులుగా అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. శనివారం అమెరికా పర్యటన ముగించుకొని అక్కడి నుంచి నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. 24, 25 తేదీల్లో ఈజిప్టులో మోదీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. చాలా ప్రత్యేకమైన యూఎస్ఏ సందర్శనను ముగించాను. అక్కడ నేను భారతదేశం – అమెరికా స్నేహం మరింతగా ఊపందుకోవడం కోసం అనేక కార్యక్రమాల్లో, పరస్పర చర్చల్లో పాల్గొన్నానని మోదీ తెలిపారు. డీసీ విమానాశ్రయం నుంచి మోదీ ఈజిప్టుకు బయలుదేరారు. ఈజిప్టు పర్యటనలో భాగంగా కైరోను ప్రధాని సందర్శిస్తారు.

కైరోలోని దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆల్ – హకీమ్ మసీదును శనివారం మోదీ సందర్శిస్తారు. భారతదేశంలోని దావూదీ బోహ్రా ముస్లింలకు ఇది ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశం. దావూదీ బోహ్రా కమ్యూనిటీతో మోదీకి ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. గుజరాత్‌లో దావూదీ బోహ్రా తనకు చాలాసార్లు సహాయం చేశారని ప్రధాని మోదీ తరచూ చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈజిప్టు పర్యటనలో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్, పాలస్తీనాలో సేవచేసి మరణించిన దాదాపు 4వేల మంది భారత సైన్యం సైనికులకు స్మారక చిహ్నంగా ఉన్న కైరోలోని హెలియోపోలీస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ శ్మశాన వాటికను ప్రధాని మోదీ సందర్శించి, నివాళులర్పిస్తారు.

ఈజిప్ట్‌లో మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి. వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సమాచార సాంకేతికత, వాణిజ్యం, సంస్కృతిపై నాలుగు లేదా ఐదు ఒప్పందాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మోదీ ఈజిప్టు పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఈజిప్టు రాయబారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com