TANA మహాసభలు.. ప్రముఖులకు అవార్డులు

- June 27, 2023 , by Maagulf
TANA మహాసభలు.. ప్రముఖులకు అవార్డులు

అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు తానా అవార్డులను బహుకరించనున్నది. తానా ఎన్టీఆర్‌ కల్చరల్‌ అవార్డును తెలుగు సినీనటుడు, నంది పురస్కార గ్రహీత, నిర్మాత, పారిశ్రామికవేత్త, మాజీ లోక్ సభ సభ్యులు మాగంటి మురళీమోహన్‌కు అందిస్తున్నారు. మురళీమోహన్‌ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకుని కళారంగానికి చేసిన కృషికి గుర్తింపుగా తానా(TANA) ఆయనకు ఈ అవార్డును బహుకరిస్తోంది.

తానా జీవిత సాఫల్య పురస్కారమును కోవిడ్ మహమ్మారి నుండి మానవాళిని కాపాడిన కోవాగ్జిన్ టీకా సృష్టికర్త, భారత దేశ మొట్టమొదటి తిమెరోసాల్ -ఫ్రీ హెపటైటిస్ బి వాక్సిన్ ఉత్పత్తిదారు అయినటువంటి భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డా. కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులకు ఇస్తున్నట్లు తానా ప్రకటించింది.

తానా ఫౌండేషన్‌ అవార్డును అమెరికాలో స్థానిక తెలుగువారికి దాతృత్వ సేవ అందిస్తునందుకుగాను, రంగనాథ బాబు గొర్రెపాటికి అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఘంటసాలకు చెందిన రంగనాథ బాబు అమెరికాకు వలస వచ్చిన తొలి తరం ప్రవాస తెలుగు వారిలో ఒకరు. అలాగే, తెలుగు భాషకు విశేష సేవలందించిన వారికి ఇచ్చే గిడుగు రామమూర్తి అవార్డును, ఈసారి మనసు ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు‌ డా. మన్నం వెంకట రాయుడుకు తానా బహుకరిస్తోంది.

తానా నాయకత్వం ఏకగ్రీవంగా ఈ పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసింది. ఎంపికైన ప్రముఖులకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి అభినందనలను తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com