సినిమా రివ్యూ: ‘హిడింబ’
- July 20, 2023
‘రాజుగారి గది’ సిరీస్‌లతో పాపులర్ అయిన నటుడు అశ్విన్ బాబు. హీరోగా పలు చిత్రాలతో తన ఉనికిని చాటుకున్నాడు. బుల్లితెర యాంకర్ కమ్ ఫిలిం మేకర్ అయిన ఓంకార్‌కి సోదరుడుగా సినీ ఇండస్ర్టీకి పరిచయమయ్యాడు అశ్విన్ బాబు. ‘రాజుగారి గది’ మొదటి సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో, ఆ తర్వాత చేసిన సినిమాలు తక్కువే అయినా ఆ ఫేమ్‌తో అందరికీ గుర్తుండిపోయాడీ యంగ్ హీరో.
లాంగ్ గ్యాప్ తీసుకుని తాజాగా ‘హిడింబ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా అశ్విన్ బాబు ఇంత వరకూ చేసిన సినిమాలన్నింట్లోకీ డిఫరెంట్ జోనర్ మూవీ. హిస్టారికల్ థ్రిల్లర్‌ని ఈ జనరేషన్‌కి కనెక్ట్ చేసి కథనం నడిపించారు. ప్రచార చిత్రాలన్నింటినీ డిఫరెంట్‌గా డిజైన్ చేసి ఆడియన్స్‌లో ఆసక్తి క్రియేట్ చేశారు. మరి, ‘హిడింబ’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.?
కథ:
అభయ్ (అశ్విన్ బాబు), ఆధ్య (నందితా శ్వేత) ఇద్దరూ పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటారు. అయితే, ఆధ్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది కానీ, అభయ్ మాత్రం హైద్రాబాద్‌లో ఓ సాధారణ పోలీస్ ఆపీసర్‌గానే వుండిపోతాడు. ట్రైనింగ్‌లో వున్నప్పుడే వీరిద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. కానీ, కొన్ని కారణాల వల్ల విడిపోతారు. కెరీర్‌లో బిజీ అయిపోతారు. కొంత గ్యాప్ తర్వాత వారి వృత్తి రీత్యా ఓ ఇంపార్టెంట్ కేసు విషయమై ఇద్దరూ కలిసి పని చేయాల్సి వస్తుంది. సిటీలో అర్ధాంతరంగా మాయమైపోతున్న అమ్మాయిల కిడ్నాప్ కేసును ఛేదించేందుకు అభయ్, ఆధ్య కలిసి పని చేస్తారు. ఎట్టకేలకు ఓ గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకుని జైలులో వేస్తారు. అక్కడితో కేసు పూర్తయిపోయిందనుకుంటారు. కానీ, విలన్ జైల్లో వుండగానే మరో అమ్మాయి కిడ్నాప్ అభయ్, ఆధ్యలను ఆలోచనలో పడేస్తుంది. విచారణలో రెడ్ డ్రస్ వేసుకున్న అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ కిడ్నాపర్ ఎవరు.? రెడ్ డ్రెస్ వేసుకుంటున్న అమ్మాయిల్నే ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు.? అండమాన్ దీవుల్లో వున్న ఓ ఆదిమ తెగకీ అసలు ఈ కథకీ సంబంధం ఏంటీ.? అనేది సినిమాలోనే చూడాలి.
నటీనటుల పని తీరు:
అశ్విన్ బాబు ఈ సినిమా కోసం డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించాడు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకునేలా వుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ మంచి ఎలివేషన్ చూపించాడు బాడీ లాంగ్వేజ్‌లో. ఇక, నందితా శ్వేత మంచి నటి తెలిసిందే. ఈ సినిమాలో ఆమెకు ప్రాధాన్యత వున్న పాత్ర దక్కింది. హీరోకి ధీటుగా నటించింది. మకరంద్ దేశ్ పాండే పాత్ర సర్‌పైజింగ్‌గా వుందనే చెప్పాలి. ఈ పాత్రను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సిజ్జు, రఘు కుంచె, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
చరిత్రతో ముడిపడిన థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రమిది. ఇలాంటి జోనర్ టచ్ చేయాలంటే బాగా పట్టుండాలి. అనిల్ కన్నెగంటి ఎంచుకున్న కథ కొత్తదే. కానీ, కథనాన్ని నడిపించడంలో కాస్త తడబడ్డాడు. నాన్ లీనియర్ ప్రోసెస్‌ని ఎంచుకున్నాడు దర్శకుడు. అదే కన్ఫ్యూజింగ్‌లో పడేసింది. వర్తమానంలో జరిగే కథకీ, గతంలో జరిగే కథని ముడిపెట్టి ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురి చేయాలనుకున్నాడు. తన వంతు కష్టపడ్డాడు కానీ, పూర్తిగా మార్కులేయించుకోలేకపోయాడు. అక్కడక్కడా ఎడిటింగ్‌లో సరి చూసుకుని వుంటే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నిజంగానే థ్రిల్ ఇచ్చేది.
మొదట్లో కథను పరుగులు పెట్టించాడు. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్‌తో కాస్త బ్రేకులు పడ్డట్టనినిప్తుంది. మళ్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ దద్దరిల్లిపోతుంది. ద్వితాయార్ధంపై ఆసక్తి కలిగేలా వుంటుంది. ఆపరేషన్ రెడ్ అనే పేరుతో హీరోయిన్ రంగంలోకి దిగడం, అసలు కథ ఇక్కడి నుంచే మొదలైనట్లు తోస్తుంది. నగరంలో జరుగుతున్న కిడ్నాపులకు అండమాన్‌లోని ఓ ఆదిమ తెగకు ముడి పెట్టిన వైనం నిజంగానే ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఇంకో ట్విస్ట్. ఇదీ థ్రిల్లింగే. హీరోలోని నెక్స్‌ట్ లెవల్ యాక్షన్‌ని బయటికి తీస్తుంది. ఇలా కథ పరంగా చాలా థ్రిల్లింగ్ అంశాలూ, సర్‌ప్రైజింగ్ సన్నివేశాలూ వున్నప్పటికీ ఎందుకో చివరిగా అసంతృప్తికరమైన ముగింపులా అనిపిస్తుంది.
కానీ, సినిమాటోగ్రఫీ బాగుంది. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్‌కి మ్యూజిక్ హార్ట్ లాంటిది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకింత సినిమాని నిలబెట్టేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
అశ్విన్ బాబు, నందితా శ్వేత ప్రామిసింగ్ పర్‌ఫామెన్స్, కథ, అక్కడక్కడా థ్రిలింగ్ సీన్స్, సర్‌ప్రైజింగ్ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, పతాక సన్నివేశాలూ, ప్రీ క్లైమాక్స్..
మైనస్ పాయింట్స్:
చిన్నపాటి ఎడిటింగ్ లోపం, కథను చెప్పడంలో కాస్త కన్‌ఫ్యూజింగ్, ముగింపు..
చివరిగా:
అమ్మాయిలూ కిడ్నాపులూ, పోలీస్ ఇన్వెస్టిగేషన్లూ.. ఈ తరహాలో ఇప్పటికే చాలా థ్రిల్లర్ సినిమాలొచ్చాయ్. వాటన్నింట్లోకీ ‘హిడింబ’ కాస్త కొత్త కథే అని చెప్పొచ్చు. కొన్ని సీన్లు షాకింగ్‌గా అనిపిస్తాయ్. లాజిక్కులు అడక్కుండా థ్రిల్లర్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే, ‘హిడింబ’ ధియేటర్లో చూసి రావొచ్చు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్‌లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!